'ఆహా'లో వచ్చిన 'భామాకలాపం' ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఆ చిత్రం.. విమర్శకుల్ని మెప్పించింది. ఇప్పుడు ఈ కథకు సీక్వెల్ గా 'భామాకలాపం 2' రూపొందింది. ఫిబ్రవరి 16న 'ఆహా'లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు టీజర్ బయటకు వచ్చింది.
తొలి భాగం ఓ ఇంటి చుట్టూ నడుస్తుంది. తెలిసీ తెలియని అమాయకత్వంతో ప్రియమణి చేసిన పనులు.. ఆమె ప్రాణాలపైకి తీసుకొచ్చిన విధానం 'భామాకలాపం' సక్సెస్ సీక్రెట్. ఇప్పుడూ అదే పంథాలో కథ రాసుకొన్నట్టు అర్థం అవుతోంది. అనుపమ చేసిన తప్పులు.. చివరికి ఆమెతో ఎలా ఆడుకొన్నాయన్నది టీజర్ లో చూపించారు. ప్రియమణి క్యారెక్టర్‌ని చాలా లైవ్లీగా తీర్చిదిద్దినట్టు అర్థం అవుతోంది. శరణ్యతో ప్రియమణి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ రెండు పాత్రలే 'భామాకలాపం' కథకు ప్రాణం పోశాయి. మళ్లీ ఆ రెండు పాత్రల చుట్టూనే కథని నడిపినట్టు అర్థం అవుతోంది.
కార్పొరేట్ కల్చర్, వివాహేతర సంబంధాలు, కిడ్నాపులు, హత్యలు, శవాలు, డబ్బు... ఇదే 'భామాకలాపం 2'కి ముడి సరుకులు అని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఆహా మొదలైన తొలి రోజుల్లో వచ్చిన 'భామాకలాపం' ఆ సంస్థకు మంచి బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు మరింత బడ్జెట్, టెక్నికల్ సపోర్ట్ తో సీక్వెల్ తీశారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.