'హనుమాన్' సూపర్ డూపర్ హిట్టైపోవడంతో అందరి దృష్టీ ఇప్పుడు 'జై హనుమాన్'పై పడింది. ఈ సినిమాని మరింత భారీ స్థాయిలో తెరకెక్కించాలన్నది దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచన. 'హనుమాన్' తో సమాంతరంగా 'జై హనుమాన్' స్క్రిప్టు కూడా రెడీ చేశారు ప్రశాంత్ వర్మ. ఈ యేడాదే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు. 2025 సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్.
'జై హనుమాన్'లో హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపిస్తారు? అనే విషయంలో రసవత్తరమైన చర్చ నడుస్తోంది. చాలామంది స్టార్ హీరోలు ఈ పాత్ర కోసం పోటీ పడుతున్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ప్రశాంత్ వర్మ మనసులో మాత్రం హనుమాన్ పాత్రలో చిరంజీవే ఉన్నార్ట. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ స్వయంగా వెల్లడించారు. హనుమాన్‌గా చిరు కనిపించే అవకాశాలు లేకపోలేదని, అయితే ఈ విషయం మెగాస్టార్ తో ఇంకా చర్చించలేదని వెల్లడించారు ప్రశాంత్ వర్మ. చిరు హనుమాన్ భక్తుడు. ఆ పాత్ర పోషించే అవకాశం వస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోడు. పైగా హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చిరు వచ్చి, ఈ సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు సీక్వెల్ లో ఆయన నటిస్తే అంతకంటే ఏం కావాలి?
మరోవైపు రాముడి పాత్ర కూడా 'జై హనుమాన్'లో కీలక భాగం పోషించనుంది. ఈ పాత్రలో మహేష్ బాబు అయితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే రాముడి వేషంలో ఉన్న మహేష్ చిత్రాలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అవి కూడా ప్రశాంత్ వర్మ దృష్టికి వెళ్లాయి. అంతెందుకు? రాముడి పాత్ర కోసం తాము కూడా మహేష్ ని దృష్టిలో ఉంచుకొని ఓ స్కెచ్ వేయించానని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ. సో.. మహేష్ ఓకే అంటే రాముడి పాత్రలో ఆయన కనిపించడం లాంఛనమే అవుతుంది. ఒకే సినిమాలో అటు మహేష్‌ని, ఇటు చిరంజీవిని చూసే ఛాన్స్ వస్తే, అంతకంటే గొప్ప సందర్భం ఏముంది? 'జై హనుమాన్'తో ఇది నిజం కావాలని కోరుకొందాం.