నటీనటులు : నవీన్ చంద్ర, సలోనీ లుథ్రా తదితరులు
దర్శకత్వం : శ్రీకాంత్ నాగోతి
నిర్మాతలు : యశ్వంత్ ములుకుట్ల
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్ : సాయి ప్రకాష్
ఎడిటర్: రవికాంత్ పేరెపు
రేటింగ్ : 3/5
ప్రేమ అనే ముడి పదార్థాన్ని ఎవరు ఎలాగైనా వాడుకోవొచ్చు. ఎంత సారమైనా పిండుకోవొచ్చు. అది ఆ దర్శకుడి సృజనాత్మకత, ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది. `ఏం చూస్తాం.. రొటీన్ స్టోరీనేగా` అనుకున్న పాయింట్ అయినా అందంగా, ఆసక్తిగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దొచ్చు. `భానుమతి రామకృష్ణ` కూడా లవ్ స్టోరీనే. ముఫ్ఫై పైబడిన ఓ ముదురు జంట.. లవ్ స్టోరీ ఇది. ఇక్కడ కూడా దర్శకుడు ఎంచుకున్న మంత్రం.. కాస్త సృజనాత్మకత. మరి.. ఆ స్థాయి ఎలా ఉంది? ఈ ఏజ్ బార్ లవ్ స్టోరీ.. ఏమైంది? భానుమతి - రామకృష్ణ జంట ప్రేక్షకుల్ని మెప్పించిందా?
* కథ
భానుమతి (సలోని రథ్రా) ఓ మల్టీనేషన్ కంపెనీలో పని చేస్తుంది. మొండిది. ఆత్మాభిమానం ఎక్కువ. జీవితంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులే తనని అలా మార్చాయి. అదే కంపెనీలో.. భానుమతికి సహాయకుడిగా చేరతాడు రామకృష్ణ (నవీన్ చంద్ర). భానుమతి ఓ రకం అయితే, రామకృష్ణ మరో రకం. మొహమాటం ఎక్కువ. ఇద్దరివీ భిన్న ధృవాలు. రామకృష్ణ అంటే భానుమతికి ఏమాత్రం పడదు. అలాంటిది... తన ప్రేమలో పడిపోతుంది. రామకృష్ణ కూడా భానుమతికి ఇష్టపడతాడు. పైగా చెప్పుకోలేడు. మరి వీరి ప్రేమకథ చివరికి ఏమైంది? ఎలా సాగింది? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
చెప్పుకోవడానికి పెద్ద కథేం కాదు. రొటీన్ స్టోరీనే. కాకపోతే... హీరో, హీరోయిన్ల గమ్మత్తైన క్యారెక్టరైజేషన్లు, ఆ పాత్రల్ని నడిపించిన పద్ధతీ.. వాళ్ల మధ్య కుదిరిన అందమైన `ముదురు` కెమిస్ట్రీ - ఇవీ ఈ కథకు ప్రాణం పోశాయి. ఈనాటి ప్రేమలన్నీ పదహారేళ్లు దాటాక మొదలైపోతున్నాయి. అందుకే ఆవేశం, ఆలోచన లేకపోవడం, వివేకం కోల్పోవడం మాత్రమేకనిపిస్తున్నాయి. ఈ ప్రేమ అలా కాదు. జీవితంలో అన్నీ చూశాక ప్రేమించుకోవడం కాబట్టి - కాస్త హుందాగా, బాధ్యతగా కనిపిస్తుంది. అసలు 30 దాటిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఆ ప్రేమని ఎలా చూపించుకుంటారు? ఆ ప్రేమకి సమస్య వచ్చినప్పుడు ఎంత మెచ్యూరిటీతో ఆలోచిస్తారు? అనే పాయింట్లని దర్శకుడు బాగా డీల్ చేశాడు.
మొదటి ఫ్రేమలోనే కథేమిటో ఊహించొచ్చు. కానీ ముందే తెలిసిపోయిన కథని చివరి వరకూ కూర్చుని చూసేలా దర్శకుడు చక్కటి కథనం రాసుకున్నాడు. సినిమా నిడివి కూడా 90 నిమిషాలే. కాబట్టి.. ఇట్టే అయిపోయినట్టు ఉంటుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేస్తున్న సినిమా కాబట్టి.. అనవసరమైన సన్నివేశాల్ని పాటల్ని ఎత్తేసి ఉంటారు. అది సినిమాకి మంచే చేసింది. ద్వేషంలోంచి ప్రేమ పుట్టే విధానం, ఆ ప్రేమని చూపించుకునే పద్ధతీ.. ఇవన్నీ బాగా చూపించాడు దర్శకుడు. ప్రేమకథల్లో కెమిస్ట్రీ, రొమాన్స్ కంటే.. సంఘర్షణ ముఖ్యం. అయితే ఆ విషయంలో.. దర్శకుడు తడబడ్డాడు. ఈ కథలో కాన్లిఫ్ట్ పాయింట్ లోపించింది. దాన్ని కాస్త బలంగా రాసుకోగలిగితే.. తప్పకుండా భానుమతి రామకృష్ణ మెప్పించే చిత్రం అవుతుంది. ఇప్పటికీ మించి పోయిందేం లేదు. హాయిగా ఇంట్లో కూర్చిని, ఇంటిల్లిపాదీ చూసేలా దర్శకుడు మలచగలిగాడు.
* నటీనటులు
నవీన్ చంద్ర మేకొవర్ ఇది. తను ఇంత సెటిల్డ్ గా నటిస్తాడా? అనిపించింది. ఇది వరకు నవీన్ చంద్ర వేరు. ఇప్పటి నవీన్ చంద్ర వేరు అని నిరూపించాడు. తన ఆవేశాన్ని, జోష్‌నీ పక్కన పెట్టాడు. తప్పకుండా తన కెరీర్ లో చెప్పుకోదగిన సినిమా అవుతుంది. సలోని కూడా ధీటుగా నటించింది. తనకు తొలి సినిమా. అయినా సరే.. అనుభవం ఉన్నదానిలా కనిపించింది. పతాక సన్నివేశాల్లో తన నటన మరింత మెప్పిస్తుంది. వైవా హర్ష కొన్ని నవ్వులు పంచాడు.
* సాంకేతిక విభాగం
లొకేషన్లు తక్కువ. ఒకే లొకేషన్లో చాలా సీన్లు నడిపించారు. కానీ ఆ ఫీల్ రాకుండా కెమెరామెన్ తన బాధ్యత చక్కగా నిర్వహించాడు. సినిమా ని 90 నిమిషాలకు కట్ చేశారంటే.. ఎడిటర్, దర్శకుడు ఎంత నిర్దాక్షణ్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవొచ్చు. పాటలు ఓకే. వాటి కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
సంభాషణలు, సన్నివేశాల రూపకల్పన.. ఈ రెండింటోనూ దర్శకుడు మార్కులు కొట్టేస్తాడు. థియేటర్లో విడుదల అయితే... మంచి మల్టీప్లెక్స్ సినిమాగా మెప్పుపొందేది.
* ప్లస్ పాయింట్స్
పాత్రధారులు
సంభాషణలు
నిడివి
నేపథ్య సంగీతం
* మైనస్ పాయింట్స్
కాన్లిఫ్ట్ లేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: హాయైన ప్రేమకథ