భరత్ అనే నేను కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ ఓ సూపర్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. దానికి తగ్గట్టే సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా పాజిటీవ్‌గా వినిపిస్తోంది. ఓ మంచి పాయింట్‌కి కమర్షియల్ అంశాలన్నీ జోడించి కొరటాల శివ చాలా చక్కగా తీశాడన్నది సెన్సార్ రిపోర్ట్. అయితే శేఖర్ కమ్ముల `లీడర్` సినిమాకీ `భరత్ అనే నేను`కీ కాస్త దగ్గర పోలికలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
ఓ ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వడం.. `లీడర్`లోని పాయింట్. ఆ సినిమాలో రానాకి రాజకీయాల గురించి ఏం తెలీదు. ఎక్కడో అమెరికాలో ఉంటాడు. నాన్న మరణించాడని తెలిసి ఇండియా తిరిగొస్తాడు. ఇక్కడ అనుకోకుండా సీఎమ్ అవ్వాల్సివస్తుంది.
సేమ్ టూ సేమ్ ఇదే పాయింట్ భరత్ అనే నేనులో కూడా కనిపిస్తుంది. భరత్ నాన్న ఓ ముఖ్యమంత్రి. ఆయన మరణానంతరం విదేశాల్లో ఉన్న భరత్ ఇండియా తిరిగొస్తాడు. పార్టీ వాళ్లంతా కలసి భరత్‌ని ముఖ్యమంత్రిని చేస్తారు.
లీడర్‌లో రానా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో నిలబడి భారీ మెజార్టీతో గెలుస్తాడు. సేమ్ టూ సేమ్ భరత్ లోనూ అంతే. ప్రతిపక్షాల కుట్ర వల్ల భరత్ రాజీనామా చేయాల్సివస్తుంది. తను మళ్లీ ఎలా గెలిచాడన్నదే కథ.
ఇలా లీడర్‌పాయింట్ అటూ ఇటుగా భరత్ లోనూ కనిపించబోతోంది. కానీ కొరటాల ట్రీట్ మెంట్ వేరు, శేఖర్ కమ్ముల తీసే విధానం వేరు. కాబట్టి.. టేకింగ్ పరంగా చాలా తేడా ఉండొచ్చు. ఈ పాయింట్‌నే కొరటాల ఎలా చెప్పాడన్నది ఇప్పుడు ఆసక్తికరం.