భారతీయుడు 2కి ఎన్ని కష్టాలో, ఇంకెన్ని నష్టాలో. ముందు నుంచీ ఈ సినిమాకీ బోలెడన్ని సమస్యలు. బడ్జెట్ తగ్గించకపోతే.. కుదరదని లైకా ప్రొడక్షన్స్ శంకర్ని హెచ్చరించిన దగ్గర్నుంచీ.. సెట్లో భారీ ప్రమాదం వరకూ ఎన్ని ఉపద్రవాలో. ఈ సినిమా నిర్మాణం చాలాసార్లు ఆగి, మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పుడు భారతీయుడు 2 శాశ్వతంగా ఆగిపోయిందని, ఇక ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమని ఓ వార్త తమిళనాట హల్ చల్ చేస్తోంది.
దీనిపై చిత్రబృందం స్పందించింది. ఇప్పటి వరకూ సగం సినిమా పూర్తయిపోయిందని, అలాంటప్పుడు సినిమాని ఎలా ఆపేస్తాం? అంటూ వివరణ ఇచ్చింది. భారతీయుడు 2 చరిత్ర సృష్టించే చిత్రమని, ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు సాధక బాధకాలు ఎదురవుతాయని.. వాటిని తట్టుకుని ముందుకెళ్తామని లైకా స్సష్టం చేసింది. నిజానికి ఇలాంటి సినిమాని మధ్యలో ఆపలేరు. ఎలాగైనా సరే, పూర్తి చేయాల్సిందే. అందుకే శంకర్ వీలైనంత వరకూ బడ్జెట్ ని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడట. ఎంత ప్రయత్నించినా, ఇలాంటి అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. మరి వాటిని దాటుకుని భారతీయుడు ఎలా ముందుకెళ్తాడో?