దర్శకులలో శంకర్ శైలి విభిన్నం. తన కలలన్నీ భారీగానే ఉంటాయి. శంకర్ సినిమా అంటే బడ్జెట్ వందల కోట్లు దాటాల్సిందే. పాటలు విదేశాల్లో, ఎవ్వరూ చూడని సరికొత్త లొకేషన్లలో తీయకపోతే శంకర్‌కి సినిమా తీసినట్టు ఉండదు. కనీవినీ ఎరుగని భారీదనానికి శంకర్ సినిమాలు కేరాఫ్ అడ్రస్. అయితే.. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా ఇలానే ఉంటానంటే కుదురుతుందేంటి? నిర్మాతలు చెప్పినట్టు చేయాల్సిందే. ఖర్చులు తగ్గించుకోవాల్సిందే. ప్రస్తుతం అదే జరుగుతోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం భారతీయుడు 2.
ఈ సినిమాకి ముందు నుంచీ బడ్జెట్ సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాగితంపై ఉన్న అంకెలకూ, సెట్స్ లో జరుగుతున్న వ్యవహారానికీ పొంతన కుదరకపోవడంతో ఈ సినిమాని నిర్మాతలు తాత్కాలికంగా ఆపేశారు. భారతీయుడు కి సీక్వెల్ ఇక ఉండదని, ఈ సినిమా చేతులు మారబోతోందని వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. నిర్మాతలు చెప్పిన షరతులకు శంకర్ తలవంచడంతో ఈ సినిమా మొదలవుతోందని టాక్. అనుకున్న బడ్జెట్ ప్రకారం సినిమా పూర్తి చేయాలని, ఒక్క రూపాయి ఎక్కువైనా అది శంకరే చెల్లించాలని నిర్మాతలు కండీషన్ పెట్టార్ట.
సినిమా ప్రారంభమైన రోజే నిర్మాతలు ఈ మాట చెప్పారు. కానీ... శంకర్ అప్పట్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం వాటికి తల వంచక తప్పట్లేదు. దాదాపు 200 కోట్లతో రూపొందుతున్న చిత్రమిది. అనుకున్న ప్రకారం 200 కోట్లలో శంకర్ ఈ సినిమా చేసేయాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఏదైతేనేం.. మొత్తానికి శంకర్ సినిమాని మళ్లీ మొదలెడుతున్నాడు. రోబో 2 పరాభవంతో ఉన్న శంకర్ ఈ సినిమాపై కసిగానే పని చేస్తున్నట్టు టాక్.