ఎక్కువగా సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించే ఓ యువ నటుడు, 'ఎన్‌టిఆర్ బయోపిక్'లో స్వర్గీయ ఎన్టీఆర్ అల్లుడి పాత్రలో కనిపించబోతున్నాడు. దాంతో, ఆ పాత్రని సినిమాలో విలన్‌గా చూపిస్తారా.? పాజిటివ్‌గా చూపిస్తారా? అనే చర్చ జరుగుతోంది.
ఆ పాత్ర పేరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. టీడీపీ ప్రస్తుత అధినేత నారా చంద్రబాబునాయుడుతో కలిసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారకరామారావుని తెలుగుదేశం పార్టీకే దూరం చేసిన ఘనుడిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు చరిత్రకెక్కారు. 'అధికార మార్పిడి అలియాస్ వెన్నుపోటు' ఎపిసోడ్‌లో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సూత్రధారులు, ముఖ్య పాత్రధారులు కూడా. ఆ తర్వాత టీడీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఔట్ అయ్యారు.
ఈ పాత్ర కోసం బాలకృష్ణ స్వయంగా భరత్ రెడ్డి అనే నటుడ్ని ఎంపిక చేయడం గమనార్హం. ఈ పాత్ర తాజా లుక్ రావడంతో, సినిమాలో ఈ పాత్ర ప్రాధాన్యత ఏంటి? అనే చర్చ జరుగుతోంది. వెన్నుపోటు ఎపిసోడ్‌ని సినిమాలో చూపించకపోతే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రకి పెద్దగా ప్రాధాన్యత వుండకపోవచ్చు. కానీ ఎన్‌టిఆర్ అల్లుళ్ళలో ఒకరిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రకి స్కోప్ వుంటుంది.
ఇదిలావుంటే నారా చంద్రబాబునాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తోన్న సంగతి తెల్సిందే. 'ఎన్‌టిఆర్ కథానాయకుడు', 'ఎన్‌టిఆర్ మహానాయకుడు'గా 'ఎన్‌టిఆర్ బయోపిక్' ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరిలో ఈ బయోపిక్, రెండు పార్టులుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది.