భీమ్లా నాయక్ దర్శకుడు ఎవరు? అంటే సడన్ గా చెప్పడం కష్టం. ముందు త్రివిక్రమ్ గుర్తొచ్చి... `ఆయన కాదు కదా.` అనుకుని, ఆ తరవాత సాగర్ చంద్ర పేరు చెబుతారు. ఈ చిత్రానికి సాగర్ దర్శకుడు. కానీ సినిమా అంతా త్రివిక్రమ్ చేతుల మీదుగానే నడుస్తోంది. త్రివిక్రమ్ ఈచిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. ఓ పాట కూడా రాశారు. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ... అన్నీ ఆయనే. సెట్లో కూడా త్రివిక్రమ్ హావానే ఉందని, త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే... సాగర్ చంద్ర ఈ సినిమా తీస్తున్నాడని రకరకాల ఊహాగానాలు. సాగర్ కేవలం నామ్ కే వాస్తే... అని, ఆయన్ని ఎప్పుడో సైడ్ చేసేశారని కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే... అదే నిజం అనిపిస్తోంది.
`భీమ్లా నాయక్`లో ప్రముఖ గాయకుడు ఖైలాష్ ఖేర్ తో ఓ పాట పాడించారు. ఆ పాటకు సంబంధించిన విషయాల్ని తెలుపుతూ ఓ ఫొటో విడుదల చేసింది చిత్రబృందం. అయితే.. ఈ ఫొటోలో సాగర్ చంద్ర లేడు. కేవలం త్రివిక్రమ్, రామ జోగయ్య శాస్త్రి, తమన్, ఖైలాష్ ఉన్నారంతే. మరి సాగర్ చంద్ర ఏమయ్యాడు? అన్నదే పెద్ద డౌటు. సాగర్‌చంద్రని పూర్తిగా సైడ్ చేసేశారా? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ సినిమా బాగా వచ్చిందని, హిట్టయితే... క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ తన ఖాతాలో పడిపోతుందని, అందుకే... ఇలాంటి స్టెప్ తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇది భావ్యమా? అంటూ పవన్ ఫ్యాన్స్ సైతం.. ఆశ్చర్యపోతున్నారు.