త్రివిక్రమ్ మాటల రచయితే కాదు పాటల రచయిత కూడా. కెరీర్ బెగిన్నింగ్ లో కొన్ని పాటలు రాశారు. ఒక రాజు ఒక రాణి సినిమాలో ఆయన రాసిన స్వరాల వీణ ఈవేళ లోన అనే ఒక హిట్ పాట కూడా వుంది. తర్వాత పాటల రచన వ్యాసంగాన్ని పక్కన పెట్టి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ వైపు వచ్చేశారు. అయితే అప్పుడప్పుడు ఆయనలోని పాటల రచయిత బయటికి వస్తుంటాడు. అత్తారింటికి దారేది సినిమాలో కెవ్వు కేక పేరడీ పాట రాసింది తివిక్రమే. 'అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు' అంటూ సరదా పెన్ను పట్టారు. అయితే ఇప్పుడు ఆయన సీరియస్ గా ఓ పాట రాశారు పవన్‌కల్యాణ్ ‘భీమ్లానాయక్’ కోసం.
మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ బయటకు వచ్చింది. ‘సౌండ్ ఆఫ్ భీమ్లానాయక్ పేరుతో పాటను విడుదల చేశారు. ఈ పాట రాసింది త్రివిక్రమ్. ‘లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవపడి’ అంటూ సాగే పాట హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ రాయడంలో త్రివిక్రమ్ తన మార్క్ చాటుకున్నారు. ఈ పాట కోసం తమన్ కొత్త ట్యూన్ చేయలేదు . మలయాళం వున్న బీట్ నే వాడుకొని మాస్ వూగిపోయేలా సౌండ్ మిక్స్ చేశాడు తమన్. మొత్తానికి తివిక్రమ్ బర్త్ డే కి అదిరిపోయే పాటని వదిలారు.