మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని ప్రకటించి చాలా రోజులైంది. అయితే ఇంత వరకూ ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. మధ్యలో మహేష్ పుట్టిన రోజు వచ్చింది. దసరా వచ్చింది. దీపావళి వచ్చింది. అయినా సరే.. చిత్రబృందం నుంచి ఎలాంటి కబురూ వినిపించలేదు. త్రివిక్రమ్ కథ ఇంకా రాయలేదని, అందుకే ఈ సినిమా లేట్ అవుతోందని ప్రచారం మొదలైపోయింది. దాంతో ఈ కాంబినేషన్ ఇప్పట్లో చూడగలమా? అనే అనుమానాలు మొదలైపోయాయి.
అయితే.. ఇప్పుడు ఈ సినిమా కథ లాక్ అయిపోయిందన్న తీపి కబురు వినిపించింది. మహేష్ ని కలిసిన త్రివిక్రమ్ కథ మొత్తం వినిపించేశాడని టాక్. మహేష్ కూడా ఈ కథకు ఓకే చెప్పేశాడట. డిసెంబరులో ఈ సినిమాని లాంఛనంగా మొదలెట్టి, సంక్రాంతికి సెట్స్‌పైకి తీసుకెళ్తారని సమాచారం. 2022లోనే ఈ సినిమాని విడుదల చేయాలన్నది ప్లాన్ గా కనిపిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు కూడా ఫైనల్ చేసేశార్ట. వాళ్ల లిస్టునీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.