ఈ సంక్రాంతికి భీమ్లా నాయక్ వస్తుందా? రాదా? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. నిజానికి సంక్రాంతి కోసమే ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు. కానీ సడన్ గా ఆర్.ఆర్.ఆర్.... విడుదల తేదీ ప్రకటించడంతో - భీమ్లా నాయక్ రిలీజ్ పై నీలి నీడలు వ్యాపించాయి. రాజమౌళి సినిమాకి భయపడి సర్కారు వారి పాట వెనక్కి వెళ్లిపోయింది. భీమ్లా నాయక్ విడుదల తేదీ వాయిదా పడబోతోందని, ఫిబ్రవరిలో గానీ, మార్చిలో గానీ ఈసినిమాని విడుదల చేస్తారని వార్తలొచ్చాయి.
కానీ... ఈ సినిమా దర్శక నిర్మాతలు భీమ్లా నాయక్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయాలని ఫిక్సయిపోయార్ట. ఎన్ని సినిమాలు పోటీకి దిగినా, భీమ్లా నాయక్ ని సంక్రాంతికే విడుదల చేస్తామని, ఈ విషయంలో పునరాలోచించుకోవాల్సిన అవసరం లేదని చిత్ర నిర్మాత సూర్య దేవర నాగ వంశీ బయ్యర్లకు చెప్పేశార్ట. అంటే.. ఈ సంక్రాంతికి భీమ్లా నాయక్ రావడం ఖాయమన్న మాట. దీంతో పాటు ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ లు సంక్రాంతి బరిలో నిలిచాయి. అంటే 2022లో సంక్రాంతి బరిలో ముక్కోణపు పోటీ చూడబోతున్నామన్నమాట. పవన్ కల్యాణ్, రానా కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సంభాషణల్ని అందించారు.