ఈ సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. పవన్ కల్యాణ్ సినిమా, అందులోనూ సంక్రాంతి సీజన్‌లో.. ఇంతకంటే కావల్సిందేముంది? కొత్తరికార్డుల కోసం ఎదురు చూడొచ్చు. కాకపోతే.. ఈ సినిమాని వెనక్కి లాగాలని కొంతమంది నిర్మాతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంక్రాంతికి రెండు పాన్ ఇండియా సినిమాలు (ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్) విడుదల కానున్నాయి. భీమ్లా వస్తే గనుక.. ఈ రెండు సినిమాల వసూళ్లకు గండి పడుతుంది. అందుకే... భీమ్లా నాయక్ ని వాయిదా వేయించాలని ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు.
కానీ భీమ్లా మాత్రం మొండి పట్టు వీడడం లేదు. దానికీ ఓ కారణం ఉంది. పవన్ కల్యాణ్ సినిమాలపై ఏపీ ప్రభుత్వం సీత కన్ను వేసిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సమయంలో, టికెట్ రేట్లు తగ్గించి, తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. జీవో నెం.35 బయటకు రావడానికి కారణం.. పవన్ ని ఇరుకున పెట్టడానికే. పవన్ సినిమా సోలోగా ఎప్పుడు వచ్చినా, ఈ ఇబ్బంది తప్పదు. అదే సంక్రాంతికి వస్తే, పండక్కి వచ్చిన సినిమాలకు కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సిందే. ఆ కోటాలో.. భీమ్లా నాయక్ కూడా లాభపడతాడు. అదే.. సింగిల్ గా వస్తే. జీవో బూచి చూపించి, టికెట్ రేట్లు తగ్గిస్తారు. అందుకే.. భీమ్లా ఇప్పుడు సంక్రాంతికే రావాలని ఫిక్సయ్యాడు. అదీ అసలు మేటరు.