టాప్ హీరోల సరసన నటించి, స్టార్ గా ఎదిగింది భూమిక. లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అయితే ఆ తరవాత భరత్ ఠాకూర్‌ని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. అడపా దడపా కొన్ని సినిమాలు చేసినా, పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఈమధ్య ఏంసీఏలో నానికి వదినగా నటించింది. రూలర్ లో ఓ పాత్ర చేసింది. అయితే అవేం పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే ఇప్పుడు బోల్డ్ పాత్రలో నటిస్తా.. గ్లామర్ కురిపిస్తా - అంటూ వెరైటీ స్టేట్మెంట్లు ఇస్తోంది. భూమికని బోల్డ్ క్యారెక్టర్లలో చూడగలమా? అనేది పెద్ద ప్రశ్న. అయినా ఈ వయసులో అలాంటి పాత్రలెవరిస్తారు? అంధాదూన్‌లో టబు చేసిన పాత్రని రిఫరెన్స్ గా చూపిస్తోంది భూమిక.
టబు స్టార్ డమ్ వేరు, ఆమెకున్న ఫాలోయింగ్ వేరు. ఈ వయసులోనూ.. తను గ్లామర్ కొనసాగిస్తోంది. పైగా అంధాధూన్ లో టబు పాత్ర మరీ అంత బోల్డ్ గా ఉండదు. అయితే అలాంటి పాత్రలు తెలుగులో చాలా తక్కువగా వస్తాయి. వచ్చినా.. భూమిక అయితే ఆ పాత్రలకు సూట్ అవ్వదు. అయినా ఎందుకు ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చిందో? బహుశా.. అంధాధూన్ తెలుగు రీమేక్ లో టబు చేసిన పాత్ర తనకు ఇస్తారని కలలు కంటుందో ఏమో...?