సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భువన విజయమ్’. తాజాగా ఈ సినిమా టీజర్ ని డైరెక్టర్ మారుతి లాంచ్ చేశారు. నిమిషం ఇరవై సెకన్ల నిడివి గల ఈ టీజర్ ని ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా కట్ చేశారు.
పాత్రలని క్యూరియాసిటీని పెంచే వాయి ఓవర్ తో పరిచయం చేయడం బావుంది. ‘’ఒక కథానాయకుడు.. అతని కథేంటో అతనికే తెలీదు.. ఒక ప్రొడ్యూసర్.. తనకి జాతకాల పిచ్చి.. ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు.. అనుకోకుండా రైటర్ గా మారిన ఓ దొంగ.. సచ్చికూడా ఇంకా మనసుల మధ్య తిరుగుతున్న ఓ ఆత్మ.. పది లక్షలు.. ఎనిమిది మంది.. ఏడు కథలు, నాలుగు గోడల మధ్య.. మూడు గంటల కాలంలో ఇద్దరు చావాలి, ఒక కథ తేలాలి’ అంటూ టీజర్ లో వినిపించిన వాయిస్, విజువల్స్ ఎక్సయిటింగా వున్నాయి.
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ల కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. మొత్తానికి సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా చేసిందీ ‘భువన విజయమ్’ టీజర్. ఏప్రిల్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.