ఆర్.ఆర్.ఆర్.. సరికొత్త చరిత్ర సృష్టించింది. నాటు నాటు పాటకు ఆస్కార్ అందడం... భారతీయ చలన చిత్ర చరిత్రలోనే సువర్ణాధ్యాయం. ఓ తెలుగు పాట ఆస్కార్ బరిలో నిలవడం, ఆస్కార్ అందుకోవడం.. అద్భుతం! ఇంతకంటే గౌరవం ఏముంటుంది? తెలుగు సినిమాకి దక్కిన అరుదైన గౌరవాల్లో ఒకటిగా.. చేరిపోతుంది. మరి ఆస్కార్ వచ్చేసింది. ఇకపై ఏం మారబోతోంది? ఈ క్రేజ్ వల్ల ఎవరికి లాభం..?
ఆస్కార్ వల్ల బాగా లబ్దిపొందేది.. రాజమౌళి. ఇక నుంచి.. రాజమౌళి బ్రాండ్ మరింతగా ప్రకాశిస్తుంది. అంతేనా..? `ఆర్.ఆర్.ఆర్` అసలు సిసలైన అంతర్జాతీయ సినిమా అవుతుంది. ఇప్పటికే రష్యా, జపాన్‌లలో ఆర్.ఆర్.ఆర్. విడుదలైంది. అక్కడ భారీ వసూళ్లు అందుకొంది. ఇప్పుడు కొత్త దేశాల్లో సైతం ఆర్.ఆర్.ఆర్ కి మార్కెట్ ఏర్పడుతుంది. ఆస్కార్ అవార్డు అందుకొన్న చిత్రం అంటూ ఓ లోగో వేస్తే చాలు.. మరిన్ని దేశాల్లో ఈ సినిమాని విడుదల చేసుకోవొచ్చు. ఇక మీదట వచ్చే రాజమౌళి సినిమాలకు కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుంది. తన బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై హాలీవుడ్ దృష్టి పడుతుంది. ఇప్పటికే వీళ్ల గురించి హాలీవుడ్ స్టూడియోలు ఆరా తీస్తున్నాయి. ఈ హీరోలు కూడా హాలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆస్కార్ అందితే... అందుకు మార్గం మరింత సుగమం అవుతుంది. కీరవాణికి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ఓపెన్ అవుతుంది. రెహమాన్ ఆస్కార్ అందుకొన్న తరవాత హాలవుడ్ సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపించాయి. రెహమాన్ కూడా బాలీవుడ్ సినిమాలు వదిలేసి, హాలీవుడ్ పై దృష్టి సారించారు. ఇప్పుడు కీరవాణికీ అదే ఫేజ్ వస్తుంది. గాయకులు కాలభైరవ, సింప్లిగంజ్‌ల కెరీర్‌కూ ఇది ఊహించని టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో.. మనకు వచ్చింది ఒక్క ఆస్కారే. కానీ.. దాని వల్ల ఈంతమంది కెరీర్‌లు ఊపందుకొంటున్నాయి. దటీజ్ ఆస్కార్.