కోవిడ్ ప్రభావం అన్ని చోట్లా ఉంది. కరోనాకి పరిశ్రమలన్నీ గిలగిలలాడిపోతున్నాయి. వెండి తెర, బుల్లి తెర.. రెండూ.. కోవిడ్ కారణంగా కుదేలైపోయాయి. తాజాగా.. బిగ్ బాస్ షో పై కూడా కోవిడ్ ప్రభావం చూపించింది. ఇప్పటి వరకూ తెలుగులో 4 సీజన్లు సాగాయి. బిగ్ బాస్ 5 సీజన్ మే - జూన్‌లలో నిర్వహించాలన్నది `మా` టీవీ ఆలోచన. ఇప్పటికే కొంతమంది సెలబ్రెటీలను ఎంపిక చేసి, అగ్రిమెంట్లు కుదుర్చుకున్నట్టు టాక్. అయితే... ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ఈసారి సీజన్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది
ఈ షోలో పాల్గొనడానికి సెలబ్రెటీలు పెద్దగా ఉత్సాహం చూపించడం లేదని, దొరికిన అరకొర సెలబ్రెటీలతో.. షో నెట్టుకురావడం కష్టమని `మా` భావిస్తోంది. గత సీజన్‌లో కూడా సెలబ్రెటీలు పెద్దగా లేరు. దాంతో బిగ్ బాస్ కి అంతంత మాత్రమే రేటింగులు దక్కాయి. ఈసారీ అదే పరిస్థితి ఎదురైతే.. ఈ షో శోభ కోల్పోవడం ఖాయం. అందుకే ఆలస్యమైనా సరే, పేరున్నవాళ్లనే రంగంలోకి దింపాలని మా యాజమాన్యం భావిస్తోంది. ఈ యేడాది ఆలస్యం అయినా, లేకపోయినా సరే.. బిగ్ బాస్ 5 మాత్రం స్టార్ సెలబ్రెటీలతోనే మొదలెట్టాలన్నది యాజమాన్యం ఆలోచన.