చిన్న సినిమాల‌కు గండ‌మే!

మరిన్ని వార్తలు

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.. ఈనాడే నిజ‌మవుతోంటే - అంటూ పాట‌లు పాడుకుంటున్నారు సినీ అభిమానులు. అక్టోబ‌రు 15 నుంచి థియేట‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో ఇంత ఆనందం. అయితే... చిత్ర నిర్మాత‌లు మాత్రం ఇంకా ఆందోళ‌న‌లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ల‌దిప్పుడు ముందు నుయ్యి - వెనుక గొయ్యి లాంటి ప‌రిస్థితి. ముఖ్యంగా చిన్న సినిమాలకు ముప్పు ఇంకా వెన్నాడుతూనే ఉంది. కేవ‌లం 50 శాతం సిట్టింగ్ తో మాత్ర‌మే థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ల‌భించాయి. నిర్మాత‌ల్ని ఇబ్బంది పెట్టే విష‌యం ఇదే. ఎందుకంటే సిట్టింగ్ 50 శాతం ఉన్నా, పూర్తిగా ఉన్నా, నిర్వ‌హ‌ణా వ్య‌యం మాత్రం ఒక్క‌టే. కానీ ఆదాయం స‌గానికి స‌గం ప‌డిపోతుంది.

 

చిన్న సినిమా వ‌స్తే... థియేట‌ర్లు అంతంత మాత్ర‌మే నిండుతున్నాయి. ఇప్పుడు సినిమా బాగున్నా - 50 శాతం ఆక్యుపెన్సీ దాట‌దు. పెద్ద సినిమాలు విడుద‌లైతే.. థియేట‌ర్లు పెంచుకుని, ప్రేక్ష‌కుల్ని ర‌ప్పించుకోవొచ్చు. చిన్న సినిమాకు ఆ సౌల‌భ్యం ఉండ‌దు. అద్దెల భారం ఎక్కువ అవుతుంది. పైగా ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల్లో సినిమా చూసే మూడ్ ఉందో లేదో ఇంకా తెలీదు. క‌రోనాకు భ‌య‌ప‌డి థియేట‌ర్ల‌కు రాక‌పోతే, టికెట్లు తెగ‌వు. దాంతో అద్దెలు రావు. ఇప్ప‌టికైతే క‌నీసం ఓటీటీలో అయినా అమ్ముకునే వీలుంది. దాని ద్వారా కనీసం ఎంతో కొంత వెన‌క్కి వ‌స్తోంది. కొన్ని సినిమాలైతే పెట్టుబ‌డి మొత్తం ఓటీటీ ద్వారా రాబ‌ట్టుకుంటున్నాయి.

 

థియేట‌ర్లో విడుద‌ల చేసిన సినిమాల‌కు ఓటీటీలో పెద్ద‌గా డిమాండ్ ఉండ‌దు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమాని విడుద‌ల చేసుకోవాలంటే నిర్మాత‌లు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకోవాల్సిందే. అలాగ‌ని పెద్ద సినిమాల‌కు స‌మ‌స్య లేద‌ని కాదు. బ‌డా సినిమాల‌కు భారీ బ‌డ్జెట్ పెట్టేస్తారు.

 

వాటిని తొలి మూడు రోజుల్లోనే వెన‌క్కి తెచ్చుకోవాలి. స‌గం సీట్ల‌తో ఆ బ‌డ్జెట్లు వెన‌క్కి రావ‌డం చాలా క‌ష్టం. కాబ‌ట్టి వ‌కీల్ సాబ్ లాంటి సినిమాలు విడుద‌లైనా, ప్రేక్ష‌కులు తండోప‌తండాలుగా వ‌స్తార‌ని, రికార్డులు బ‌ద్ద‌లు అవుతాయ‌ని ఆశించ‌కూడ‌దు. ఏదేమైనా అక్టోబ‌రు 15న థియేట‌ర్లు తెర‌చుకున్నా... సినిమాలు రావ‌డానికి మాత్రం మ‌రి కొన్ని రోజులు ప‌ట్టేట్టు క‌నిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS