బిగ్ బాస్ నుంచి ఫేమ్ తెచ్చుకొన్నవాళ్లు వెండి తెరపైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోడం సహజమే. ఇప్పుడు ఆ జాబితాలో ఆయేషా ఖాన్ చేరబోతోంది. హిందీ బిగ్ బాస్ - 17 షోతో దేశ వ్యాప్తంగా తనవైపు అటెన్షన్ పెంచుకొంది ఆయేషా. ఇప్పుడు టాలీవుడ్ నుంచి పిలుపు అందింది. విశ్వక్ సేన్ కొత్త సినిమా `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` సినిమాలో తను ఓ ఐటెమ్ గీతం చేస్తోంది. ముందుగా ఈ పాట కోసం ఈషారెబ్బాని ఎంచుకొందాం అనుకొన్నారు. చివరి నిమిషంలో ఆ ఛాన్స్ ఆయేషా కొట్టేసిందట. ఇటీవల ఈ పాటని కూడా తెరకెక్కించారని సమాచారం. ఆయేషాలో మంచి ఫీచర్స్ ఉన్నాయని, తనకు తెలుగులో ఇలాంటి అవకాశాలు మరిన్ని రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు. అంజలి ఓ కీలక పాత్ర పోషిస్తోంది. సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. అయితే అనివార్య కారణాల వల్ల విడుదల కావడం లేదు. మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఓ పాట బాగా పాపులర్ అయి, ఈ సినిమాపై క్రేజ్ పెంచింది.