హాఫ్ ఆఫ్ ది సీజన్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి చూపించినట్లే చూపించి, టచ్ మీ నాట్ అనేలా మెలిక పెట్టి తీసుకెళ్లిపోయారు. అదృష్టం కలిసొచ్చి వితిక, రవికృష్ణలకు సంబంధించిన బంధువులకు మాత్రమే కన్‌ఫేషన్ రూమ్‌లో కలుసుకొనే అవకాశం దక్కింది. మిగిలిన వారి ఆశలు ఆడియాశలుగానే మిగిలిపోయాయి. బిగ్‌బాస్ చేసిన ఈ చర్యను శ్రీముఖితో సహా పలువురు హౌస్‌మేట్స్ ఖండించారు. ఐ హేట్ బిగ్‌బాస్ అని అభివర్ణించారు.
అంతేగా మరి, మొత్తానికి చూపించకుండా ఉంటే బాగానే ఉండేది. రాక రాక అంత దగ్గరగా వచ్చిన బంధువుల్ని, కలవనీయకుండా పంపించడం అంటే నిజంగా అది అరాచకమే. అదే అభిప్రాయాన్ని శ్రీముఖి వెల్లడించింది. ఇకపోతే, హౌస్‌మేట్స్ మధ్య పుల్లలు పెట్టడమే కాదండోయ్. వారి కుటుంబ సభ్యుల మధ్య పుల్లలు పెట్టడం ఎలాగో కూడా బిగ్‌బాస్‌కి బాగా తెలుసు. ఎవరు బిగ్‌బాస్ 1, 2 స్థానాల్లో నిలుస్తారో వారి వారి అభిప్రాయాలు చెప్పమని, గెస్ట్‌లుగా వచ్చిన కుటుంబ సభ్యులకు సూచించాడు బిగ్‌బాస్.
ఇంకేముంది.. వారు విజృంభించేశారు. హౌస్‌లో టాస్క్‌ల్లో జరిగే బిగ్ ఫైట్‌ని మించిన ఫైట్ వారి మధ్య నెలకొంది. చాలా బలంగా వాదులాడుకున్నారు. ఈ ఎపిసోడ్‌లో పునర్నవి సోదరుడు చాలా మెచ్యూరిటీగా వ్యవహరించాడు. అక్కని కలిసే అవకాశం లేకపోయినా, అక్కడి నుండే మాటలతో ఆమెకు అసలు సిసలు ఎనర్జీని నూరి పోశాడు. అక్కని లేడీ మోనార్క్‌గా అభివర్ణించాడు. తన సోదరుడి ఆటిట్యూడ్‌ని చూసి పునర్నవి ఎమోషన్‌తో కూడిన ఎంజాయ్‌మెంట్ ఫీలయ్యింది. ఇలా తాజా ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా సాగింది.