గత వారం డబుల్ ఎలిమినేషన్.. అంటూ ముందే ‘సమాచారం’ లీక్ అయ్యింది. దాంతో, చివరి నిమిషంలో బిగ్ బాస్ టీమ్ తన ఆలోచనల్ని మార్చుకుందట. డబుల్ ఎలిమినేషన్.. అంటూనే, ఫేక్ ఎలిమినేషన్‌కి తెరలేపారు. లేదంటే, హారిక - అభిజిత్‌లలో ఎవరో ఒకరు సీక్రెట్ గదిలోకి వెళ్ళి వుండేవారట. ఇదిలా వుంటే, మరోమారు ‘డబుల్ ఎలిమినేషన్’ ప్రచారం జరుగుతోంది.
ఈ వారం ఇద్దరు ఖచ్చితంగా హౌస్ నుంచి ఔట్ అయిపోబోతున్నారట. అందులో కుమార్ సాయి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరో ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చేలా వుండబోతోందట. అయితే, ఈ వార్తల్లో నిజమెంత.? అన్నదానిపై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది. ఈసారి ఫేక్ ఎలిమినేషన్ వుండకపోవచ్చనీ, సీక్రెట్ గది వ్యవహారాలూ వుండబోవనీ, ఇద్దరు ఖచ్చితంగా ఔట్ అవుతారనీ అంటున్నారు. ఇద్దరు ఎలిమినేట్ అవడం, కొత్తగా ఒకరు లేదా ఇద్దర్ని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురావడం బిగ్ బాస్ టీమ్ వ్యూహంగా కనిపిస్తోంది. అందులో ఒకరు హీరోయిన్ యామినీ భాస్కర్ కాగా, మరో మేల్ కంటెస్టెంట్ వుంటారని సమాచారం.
కాగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే వారంలోనే వుంటాయన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. ‘సీక్రెట్ గది’ వ్యవహారం కూడా వుండబోతోందనీ, అయితే అది ఇప్పుడే కాదని అంటున్నారు. ఇదిలా వుంటే, బిగ్ హౌస్‌లో వాతావరణం అనూహ్యంగా వేడెక్కిపోయింది. అడ్డగోలుగా తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోతోంది పరిస్థితి. అంతా ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ఎపిసోడ్ కారణంగానే.