కెప్టెన్ కుర్చీపై అందరికీ మోజు ఉంటుంది. అయితే కొంతమంది దాన్ని నెరవేర్చుకుంటారు. కొంతమంది కలల్లోనే విహరిస్తుంటారు. చాలామంది రిస్క్ చేయడానికి ఇష్టపడరు. అతి తక్కువ మంది మాత్రమే ధైర్యంగా ముందు అడుగు వేస్తారు. హీరోలు, నిర్మాతలు, నటీనటులు, కొరియో గ్రాఫర్లు, కెమెరామెన్లు.. దర్శకులుగా మారడం చూశాం. హీరోయిన్లూ అతీతం కాదు. ఇప్పుడు ఈ జాబితాలోంచి మరో పేరు బయటకు రాబోతోందని సమాచారం.
తెలుగు నాట టాప్ కథానాయికగా చలామణీ అవుతోంది సమంత. ప్రస్తుతానికైతే లేడీ ఓరియెంటెడ్ కథలపై దృష్టి పెట్టింది. అయితే త్వరలోనే సమంత రూటు మార్చాలని చూస్తోందట. మెగాఫోన్ పట్టి, తనలోని టాలెంట్ ని బయటకు లాగాలని ప్రయత్నిస్తున్నట్టు టాక్. ఈ లాక్ డౌన్ సమయంలో.. సమంతలో చాలా ఆలోచనలు వచ్చాయని, అందులో చిత్ర నిర్మాణం, దర్శకత్వం కూడా ఉన్నాయని టాక్.
ఓ కథ సమంత దగ్గర రెడీగా ఉందని, ఆ కథతోనే సమంత దర్శకురాలిగా అడుగుపెట్టబోతోందని, ఓ మంచి ముహూర్తం చూసుకుని, ఈ షాకింగ్ నిర్ణయాన్ని బయటపెట్టబోతోందని టాక్. అన్నట్టు ఈ సినిమాని అన్నపూర్ణ సంస్థలో నిర్మిస్తార్ట. కాకపోతే... సమంత చేతిలో ఓ సినిమా ఉందిప్పుడు. సోనీ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేస్తోంది. అది పూర్తయ్యాకే సమంత కెప్టెన్ కుర్చీలో కూర్చునే ఛాన్స్ వుంది.