తెలుగులో బాగా ఫేమస్ అయిన రియాలిటీ షోలలో.. బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికి నాలుగు సీజన్లు పూర్తయ్యాయి. 5వ సీజన్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్ లో ఇంటర్వ్యూలు పూర్తి చేసి, జులైలో షోని పట్టాలెక్కించాలనుకున్నారు. కానీ.. ఇప్పుడు షెడ్యూల్ మారింది. జులైలో బిగ్ బాస్ మొదలెట్టడం కష్టమని తేలిపోయింది. అందుకే.. ఈ సీజన్ ని అక్టోబరుకి మార్చినట్టు సమాచారం.
బిగ్ బాస్ వాయిదా పడడానికి ప్రధాన కారణం.. సెలబ్రెటీలు ఇంకా దొరక్కపోవడమే. పేరున్న వాళ్లు... బిగ్ బాస్ అంటే... రావడానికి భయపడుతున్నారు. కరోనా వాళ్లను భయపెడుతున్న ప్రధాన కారణం. మరోటి... బిగ్ బాస్ లో విజేతలైనా సరే, సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడం. బిగ్ బాస్ లోకి అడుగుపెడితే, దాదాపు 100 రోజుల పాటు ఇంటికి, షూటింగులకు దూరం అవ్వాలి. చేతిలో ఉన్న సినిమాల్ని వదులుకోవాలి. ఇదంత తేలిగ్గా తెగే వ్యవహారం కాదు. అందుకే.. ఈ షో వాయిదా వేసినట్టు సమాచారం.
బిగ్ బాస్ షో కోసం పాయల్ రాజ్ పుత్ ని సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. అయితే.. ఈ వార్తల్ని పాయల్ ఖండించింది. తనకెలాంటి ఆఫర్లూ రాలేదని తేల్చేసింది. బిగ్ బాస్ లోకి వెళ్లడం ఇష్టం లేదన్నట్టుగానే ఉన్నాయి పాయల్ వ్యాఖ్యలు. మరోవైపు... టీవీ 5 మూర్తి, కమిడియన్ ప్రవీణ్, యాంకర్లు శ్రీముఖి, రవి, ప్రదీప్ లాంటి పేర్లు ఈసారి గట్టిగా వినిపిస్తున్నాయి. మరి వాళ్లంతా ఓకే అంటారా, కాదా.. అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.