ఎన్నో అంచనాలు, ఇంకెన్నో అనుమానాలతో `బిగ్ బాస్ 4` మొదలైంది. లాక్ డౌన్ సమయంలో.. అంతా ఇంటి పట్టునే ఉంటారు కాబట్టి, బిగ్ బాస్ షో ఇది వరకెప్పుడూ లేనంత పెద్ద హిట్ అవుతుందని కొంతమంది, ఈ సమయంలో బిగ్ బాస్‌కి ఆదరణ దొరకదని మరికొంతమంది అభిప్రాయ పడ్డారు. బిగ్ బాస్ కొత్తసీజన్‌లో ప్రేక్షకుల్ని కట్టిపడేసే సెలబ్రెటీలు పెద్దగా లేకపోవడంతో - ఈ షో అంతగా రక్తి కట్టే అవకాశం లేదని తేల్చేశారు.
అయితే.. ఈ అనుమానాల్ని పటాపంచలు చేసేసింది బిగ్ బాస్ 4. తొలి ఎపిసోడ్ కి ఏకంగా 18.5 రేటింగ్ వచ్చింది. ఇది తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్. దాంతో.. బిగ్ బాస్ నిర్వాహకుల్లో కొత్త ఉత్సాహం రేకెత్తింది. అయితే ఈ ఊపు, ఉత్సాహం ఎన్ని రోజులు కొనసాగుతుందన్నది అనుమానమే. బిగ్ బాస్ టాస్క్‌లు పెద్దగా రక్తి కట్టడం లేదు. పైగా ఇదివరకటిలా బిగ్ బాస్ షోలో మ్యాజిక్కులు సాగడం లేదు. ఓవర్ యాక్షన్, మితిమీరిన మెలో డ్రామాలతో విసుగెత్తిస్తున్నారు కంటెస్టెంట్లు. నాగ్ వచ్చే శని, ఆదివారాల ఎపిసోడ్లకు మాత్రం ఈ రేంజులోనే రేటింగులు వచ్చే అవకాశం వుంది.