అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే గత సమ్మర్‌లోనే ‘వకీల్ సాబ్’ విడుదలైపోయి వుండేది. కానీ, కరోనా దెబ్బ కారణంగా ‘వకీల్ సాబ్’ షూట్ పార్ట్ కొంత మిగిలిపోయింది. తిరిగి సినిమా షూటింగులు ప్రారంభమవుతున్నా, ‘వకీల్ సాబ్’ గురించిన ఎలాంటి అప్‌డేట్ బయటకు రావడంలేదు. హీరో పవన్ కళ్యాణ్, సినిమా షూటింగ్‌ని పునఃప్రారంభించడానికి అంత సుముఖంగా లేడట. కరోనాకి వ్యాక్సిన్ రాకపోవడం, ఇంకా కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతుండడంతో.. ఒకవేళ షూటింగ్ ప్రారంభమైనా ఇబ్బందులు తప్పవన్నది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. మరోపక్క నిర్మాత దిల్ రాజు మాత్రం, వీలైనంత త్వరగా షూటింగ్‌ని పునఃప్రారంభిస్తే బావుంటుందన్న ఆలోచనతో వున్నారని సమాచారం.
నిర్మాత, దర్శకుడు, హీరో.. ఈ ముగ్గురూ త్వరలోనే కలిసి ఓ నిర్ణయానికి వస్తారనీ, నవంబర్‌లోపు సినిమా షూటింగ్ పునఃప్రారంభమయ్యే అవకాశాల్లేవనీ అంటున్నారు. ఒకవేళ నవంబర్ చివరి నాటికి షూటింగ్ గనుక పూర్తి కాకపోతే, సంక్రాంతి సీజన్‌లో ‘వకీల్ సాబ్’ వచ్చే అవకాశమే లేదట. ‘సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్నాం. కానీ, ఈలోగా అన్నీ సహకరించాలి కదా..’ అని ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వేణు శ్రీరావ్‌ు చెప్పిన విషయం విదితమే. షూటింగ్ పూర్తి చేయడంతోపాటుగా, సినిమా హాళ్ళ ప్రారంభం అనేది ఇక్కడ అత్యంత కీలకమైన అంశం. ఓటీటీ అవకాశమే లేకపోవడంతో, సినిమా నిర్మాణం పూర్తి చేసేసి ఏం చేసుకుంటాం.? అన్న భావన కూడా వుంది ‘వకీల్ సాబ్’ మేకర్స్‌లో.