ఈ ఆగస్టు టాలీవుడ్ కి బాగానే కలిసొచ్చింది. వరుసగా మూడు మంచి విజయాల్ని తన ఖాతాలో వేసుకొంది. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ మూడింటిలో `బింబిసార` విజయం ప్రత్యేకం. ఎందుకంటే ఓ సోషియో ఫాంటసీ సినిమా ఇది. విడుదలకు ముందు ఈసినిమాపై ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు. అయితే.. అనూహ్యంగా హిట్ కొట్టేసింది. వసూళ్లని బట్టి చూస్తే.. ఇప్పుడు బింబిసార సూపర్ హిట్. ఎందుకంటే.. తొలి 13 రోజుల్లోనే రూ.30 కోట్లు సంపాదించేసింది. దాదాపు రూ.15 కోట్లతో నిర్మించిన సినిమా ఇది. అంటే.. రూపాయికి రూపాయి లాభం అన్నమాట. ఫైనల్ రన్ ఇంకా టైమ్ ఉంది కాబట్టి... మరో రూ.5 కోట్లయినా రావొచ్చన్నది ట్రేడ్ వర్గాల అంచనా.
పైగా ఈవారం... పెద్దగా సినిమాలేం లేవు. ఈ వీకెండ్ కూడా `బింబిసార`కి వసూళ్లు దక్కే ఛాన్సుంది. వచ్చేవారం `లైగర్` వచ్చేలోగా.. ఇంకొన్ని వసూళ్లు సాధించే ఛాన్సులు ఉన్నాయి. నైజాంలో ఇప్పటి వరకూ... రూ. 8.6 కోట్లు తెచ్చుకొంది. సీడెడ్ లో రూ.6.5 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో రూ.2 కోట్ల వరకూ వచ్చాయి. ఈ సినిమాకి `సీతారామం` నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఫ్యామిలీ ఆడియన్స్ `సీతారామం` వైపు మొగ్గు చూపించారు. లేదంటే.. `బింబిసార`కు మరిన్ని వసూళ్లు దక్కేవి.