రవితేజకు ఈమధ్య హిట్లు పడడం లేదు గానీ, తన ఆడియోలన్నీ సూపర్ హిట్లే. ముఖ్యంగా రవితేజ ఆల్బమ్ అంటే.. కచ్చితంగా ఓ మాస్ పాట పడి తీరుతుంది. అది కొన్నాళ్ల పాటు మార్మోగిపోతుంటుంది. 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ'లలో కూడా ఇలాంటి మాస్ పాటలే చూశాం.
ఇప్పుడు 'ధమాకా'లోనూ ఊపేసే పాట పెట్టారు. అదే.. 'జింతాక'. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ఇది. నక్కిన త్రినాథరావు దర్శకుడు. ఈ సినిమా నుంచి తొలి పాట బయటకు వచ్చింది. `నిన్ను చూడబుద్దైతాంది రాజిగో..మాటాడబుద్దైతాంది రాజిగో..జింతాక...జింతాక.. మంగ్లీ, భీమ్స్ ఆలపించారు. భీమ్స్ సర్వపరచిన ఈ గీతాన్ని కాశర్ల శ్యామ్ రచించారు. రవితేజతో పాటు శ్రీలీల స్టెప్పులేసింది. తొలి సినిమా 'పెళ్లి సందడి'లో శ్రీలీల తన డాన్స్ తో ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. ఈ పాటలోనూ గ్రేస్‌ఫుల్‌గా స్టెప్పులేసింది. రవితేజ - విక్రమార్కుడులోని 'జింతాక'.. స్టెప్పు ఈ పాటలో రిపీట్ అవ్వడం విశేషం. డాన్సులతో పాటు, లొకేషన్లు, కాస్ట్యూమ్స్, లిరిక్స్ అన్నీ క్రేజీగా ఉన్నాయి. థియేటర్లో ఈ పాట ఓ ఊపు ఊపడం ఖాయంగా కనిపిస్తోంది. టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది.