2017 వెళ్లిపోతోంది. ఎన్నో తీపి గుర్తుల్ని మిగిల్చిన యేడాది ఇది. సూపర్ హిట్ సినిమాల్ని అందించిన సంవత్సరం ఇది. చేదు జ్ఞాపకాలు, ఫ్లాప్స్ ఎన్ని ఉన్నా.. మధ్యలో ఒక్క హిట్టు పడితే - ఆ బాధనంతా మర్చిపోతాం. అలా ప్రతీ సీజన్‌లోనూ ఓ హిట్ వచ్చి, కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 2017లో బ్లాక్ బ్లస్టర్ అనిపించుకున్న సినిమాలపై ఓ లుక్కేస్తే....
తనదైన హీరోయిజంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించి కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న మెగాస్టార్.. దాదాపు తొమ్మిదేళ్లు తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెం 150తో. తొమ్మిదేళ్లు తరవాత ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మళ్లీ వెండితెరపై ప్రత్యక్షమైన క్రేజీ సినిమా ఇది. మెగాస్టార్ వస్తున్నారనగానే ఎన్నో అంచనాలు. ఈ అంచనాలకు మించి అదరగొట్టేశారు మెగాస్టార్. తనలోని జోష్ ఇసుమంత కూడా తగ్గలేదని ఖైదీ నెం 150తో రుజువు చేశారు. నటనలో, జోష్ లో డ్యాన్స్ లో , యాక్షన్ సీన్స్ లో ఎక్కడా కూడా తగ్గలేదు. అభిమానులు తన నుండి ఏం ఆశిస్తారో .. తను ఏం చేస్తే అభిమానులకు నచ్చుతుందో సరిగ్గా అలాంటి వినోదంతోనే సందడి చేశారు. రికార్డుల పరాగంగా కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్. చిరంజీవి కెరీర్ లోనే హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాహా నిలిచింది ఖైదీ నెం 150. అంతేకాదు బాహుబలి సినిమా తప్పితే నాన్ బాహుబలి రికార్డులన్నీ సొంతం చేసుకుంది ఖైదీ నెం 150.
2017 బాలయ్య కు వెరీ స్పెషల్. తన సినీ ప్రయాణానికి ఓ కీలకమైన మైలురాయిలాంటి వందో చిత్రం చేశారు. ఆయన వందో సినిమాగా ఈ ఏడాది గౌతమిపుత్ర శాతకర్ణి థియేటర్ లోకి వచ్చింది. చారిత్రక పాత్రల్లో ఇమిడిపోతారు బాలకృష్ణ. ఆ తరహా కథలని నమ్మి సినిమా చేయడంలోనూ తనకి తానే సాటి అయిన బాలయ్య తన వందో చిత్రం`గౌతమిపుత్ర శాతకర్ణి` మరోసారి రుజువు చేసింది. తెలుగు జాతి వీరత్వాన్ని చాటి చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్యను చూసి ఫిదా అయిపోయారు . శాతకర్ణిగా బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. బాలయ్య కెరీర్ అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. అలాగే బాలయ్య కెరీర్ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా కూడా ఇదే.
2017 లో అసలు సిసలైన సంక్రాంతి సినిమా శతమానం భవతి. కుటుంబ కథ వెండితరపై ఎవర్ గ్రీన్ ఫార్ముల. కుటుంబ కథల్లో కనిపించే అనురాగం, ఆప్యాయతల్ని తెరపై ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. కుటుంబం గొప్పతనమే అది. ఇదివరకే మన తెరపై ఎన్నో గొప్ప కుటుంబ కథల్ని చూపించినప్పటికీ... దర్శకుడు సతీష్ వేగేశ్న రాసుకొన్న శతమానం భవతి కథ, అనుబంధాల మధ్య సంఘర్షణని ఆయన చూసిన.. చూపించిన కోణం కొత్తగా అనిపించింది. 2017 సంక్రాంతికి రెండు భారీ సినిమా బాక్సాఫీసు దండయాత్రకు వచ్చాయి. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ రెండూ ప్రతిష్టాత్మక చిత్రాలే. అయితే ఈ బాక్సాఫీసు వార్ జోన్ లో దిగిన తమానం భవతి సంక్రాంతి విజేత అనిపించుకుంది. వసూళ్ళు పరంగా కూడా ఈ సినిమాకి ఫుల్ మార్కులు పడిపోయాయి. రూపాయి పెడితే రెండు రూపాయిలు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది శతమానం భవతి.
వెండితెర అద్భుతం బాహుబలి. . ఇండియన్ సినిమా చరిత్రలో అప్పటివరకూ వున్న రికార్డులన్నీ చెరిపేసి తెలుగు సినిమా ఖ్యాతిని దసదిశలా చాటింది బాహుబలి. ‘బాహుబలి ది: బిగినింగ్’ కు కొనసాగింపుగా 2017లో వచ్చిన‘..కన్‌క్లూజన్’ బాక్సాఫీస్ వద్ద మిగతా రికార్డులన్నీ బ్రేక్ చేసింది. వెండితెర అద్భుతంగా నిలిచిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇండియన్ సినిమాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. రాజమౌళి చెక్కిన మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూసి అభిమానులు మైమరచిపోయారు. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి ఎప్పటికీ కోట్ల రుపాయిలతో నిలిచిపోతుంది.