బాక్సాఫీసు కి హిట్లూ, ఫ్లాపులూ మామూలే. సూపర్ డూపర్ హిట్లూ తెలుసు. అట్టర్ ఫ్లాప్ సినిమాలూ తెలుసు. సినిమా భాషలో వీటినే డిజాస్టర్లు అంటారు. బాహుబలి 2 లాంటి బ్లాక్ బ్లస్టర్ చూసిన యేడాది 2017. ఇండియన్ రికార్డులన్నీ తిరగరాసిన బాహుబలి 2ని చూసిన యేడాదే కొన్ని డిజాస్టర్ సినిమాల్నీ మోయాల్సి వచ్చింది. 2018 కూత వేటు దూరంలో ఉన్న ఈ తరుణంలో... టాలీవుడ్‌ని పట్టిపీడించిన డిజాస్టర్లేంటో ఓ లుక్కేస్తే...
* స్పైడర్
ఈ యేడాది అత్యంత భారీ ఫ్లాప్ ఏమిటి? అని అడిగితే నిస్సంకోచంగా `స్పైడర్` పేరు చెప్పేయొచ్చు. తెలుగు, తమిళ భాషల్లో కలిసి దాదాపు రూ.120 కోట్లతో తెరకెక్కిన చిత్రమిది. మహేష్ బాబు - మురుగదాస్ కాంబో అనగానే చిత్రసీమలో ఎక్కడ లేని అంచనాలూ పెరిగిపోయాయి. ఫ్లాప్ సినిమా తీసిన చరిత్ర మురుగదాస్‌కి లేదు. పైగా రూ.150 కోట్ల భారీ బడ్జెట్. మురుగదాస్ పై నమ్మకంతోనే `స్పైడర్`తో తమిళనాట అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు మహేష్. దేశంలో అత్యున్నతమైన సాంకేతిక నిపుణుల టీమ్ `స్పైడర్`కి అండగా దొరికింది. అయినా.. సరే.. బాక్సాఫీసు దగ్గర పల్టీ కొట్టేసింది. కథలో వైవిధ్యం ఉన్నా - కథనం విషయంలో మురుగదాస్ తప్పటడుగు వేశాడు. సూర్య పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం, సినిమా అంతా తమిళ వాసన కొట్టడం, కీలకమైన చోట్ల మురుగదాస్ మ్యాజిక్ పనిచేయకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది. తెలుగులో భారీ ఓపెనింగ్స్ వచ్చినా.... అది తొలి రోజుకే పరిమితమైంది. తమిళంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. స్పైడర్ దెబ్బతో చాలామంది బయ్యర్లు.. రోడ్లమీదకు వచ్చేశారు. సినిమా విడుదలైన తరవాత ఎంత ఫ్లాప్ అయినా సరే - సక్సెస్ మీట్ పెట్టి హడావుడి చేయడం చూస్తూనే ఉంటాం. కానీ.. `స్పైడర్` అలాంటి డమ్మీ సక్సెస్ మీట్‌కీ నోచుకోలేకపోయిందంటే ఎంత ఫ్లాపో అర్థం చేసుకోవొచ్చు.
* లై
అందాల రాక్షసితో తనపై నమ్మకం తీసుకురాగలిగాడు హను రాఘవపూడి. కృష్ణగాడి వీర ప్రేమగాథతో తొలి హిట్టు అందుకున్నాడు. నితిన్‌తో హను సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. ఎందుకంటే నితిన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అర్జున్‌ని తీసుకొచ్చి... సినిమాపై అంచనాలు పెంచారు. `లై` అనే టైటిల్, ట్రైలర్లో వినిపించిన డైలాగులు, బిల్డప్ షాట్లూ ఇవన్నీ చూసి.. మరో సూపర్ హిట్ రావడం ఖాయమనుకున్నారంతా. అయితే... `లై` ఈ అంచనాలకు వేల కిలో మీటర్లు దూరంలో నిలిచిపోయింది. పెట్టిన ఖర్చు మినహాయిస్తే.. తెరపై ఏం కనిపించలేదు. హను తన తెలివితేటల్ని చూపించడానికి కోట్లు వాడుకోవడం తప్ప - మరేం మిగల్లేదు. ఓపెనింగ్స్ ఓకే అనిపించినా.. ఆ జోరు తొలి రోజుకే పరిమితమైంది. వెరసి చూస్తే.. 2017 డిజాస్టర్ల జాబితాలో `లై` కూడా చేరిపోయింది.
* నక్షత్రం
టాలీవుడ్‌లో క్రియేటీవ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కృష్ణవంశీ. ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా ఆయనపై గౌరవం మాత్రం తగ్గలేదు. కృష్ణవంశీ ఈసారైనా మంచి సినిమా తీస్తాడులే అనే ఆశతో ఎదురు చూసేవాళ్లు. నక్షత్రంపై కూడా అలాంటి ఆశలు, అంచనాలు కలిగాయి. సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజ్ - ఇలా స్టార్స్‌ని తీసుకొచ్చి ఈ సినిమాపై హైప్స్ క్రియేట్ చేశాడు కృష్ణవంశీ. పోలీస్ కథలు ఎప్పుడు తీసినా.. వంశీ ఫెయిల్ కాలేదు. ఈసారీ తనకు హిట్టు దొరుకుతుందనుకున్నారు. కానీ... నక్షత్రం కృష్ణవంశీ కెరీర్‌లో అత్యంత దారుణమైన ఫ్లాపుల్లో ఒకటిగా చేరిపోయింది. దురదృష్టం ఏమిటంటే ఈ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు.
* విన్నర్
గతేడాది సాయిధరమ్ తేజ్ కెరీర్ బాగానే నడిచింది. 2017 మాత్రం సాయికి కలసి రాలేదు. ఈయేడాది తాను చేసిన సినిమాల్నీ ఫ్లాపులే. అందులో విన్నర్ పెద్ద ఫ్లాపు. సాయి ధరమ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. నిర్మాతలకు కనీసం 30 శాతం కూడా తిరిగి రాలేదు. కనీసం రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ కూడా జనాల్ని థియేటర్‌కి రప్పించలేకపోయింది. తొలి రోజు కూడా ఎక్కడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించలేదు. ఈ దెబ్బతో గోపీచంద్ మలినేని కి మరో సినిమా లేకుండా పోయింది.
* మిస్టర్
పాపం.. శ్రీనువైట్ల. ఆయన జాతకాన్ని 2017 కూడా మార్చలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మిస్టర్ కూడా డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమాపై ముందు నుంచీ శ్రీనువైట్ల చాలా నమ్మకంతో ఉండేవాడు. తన జోనర్ మార్చానని, సినిమా తీసే స్టైల్ కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చేవాడు. టీమ్ మారినా.. తీత మారినా.. తన రాత మాత్రం మారలేదు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం అటుంచితే... నిర్మాతలతో విబేధాలు కూడా తీసుకొచ్చింది. అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయలేదని, శ్రీనువైట్ల వల్ల తాము బాగా నష్టపోయామని నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. మిస్టర్ తరవాత.. మరో హీరో శ్రీనువైట్లతో సినిమా చేయడానికి భయపడాల్సిన పరిస్థితులు మరింతగా ఎక్కువయ్యాయి.
* యుద్దం శరణం
పేరున్న హీరో, బడా నిర్మాణ సంస్థ, భారీ బడ్జెట్ సినిమా.. ఇన్ని హంగులున్నా ఏమాత్రం వార్తల్లో లేకపోయిన సినిమా ఏదైనా ఉందంటే.. అది యుద్దం శరణం అనే చెప్పుకోవాలి. ఎందుకో ఈ సినిమాపై ముందు నుంచీ ఎవ్వరికీ నమ్మకాల్లేవు. దానికి తగ్గట్టే నిర్మాణం కూడా లో ప్రొఫైల్‌లో సాగింది. ప్రచార ఆర్భాటం లేకపోవడంతో ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ సినిమా గురించి మాట్లాడ్డానికి కూడా అటు సాయి కొర్రపాటి గానీ, ఇటు నాగచైతన్య గానీ ఆసక్తి చూపించకపోవడంతో యుద్దం శరణం ఏ రేంజు ఫ్లాపో అర్థం చేసుకోవొచ్చు. యాక్షన్ టైపు కథలు నాగచైతన్యకు వర్కవుట్ అవ్వవు అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. రూపాయి పెట్టుబడి పెడితే పావలా కూడా తిరిగి రాకపోవడం ఈ సినిమా ఫలితం ఎలాంటిదో చెప్పకనే చెప్పింది. వారాహి సంస్థకు, చైతూకూ ఇది అతి పెద్ద ఫ్లాప్ అనుకోవొచ్చు.