కరోనా బాధితుల్ని ఆదుకోవడానికి సంగీత ప్రపంచం తరలి వచ్చింది. `ఐ ఫర్ ఇండియా` పేరుతో ఓ లైవ్ కాన్సర్ట్ ఏర్పాటు చేసింది. దేశంలోని ప్రముఖ గాయనీ గాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ పాటలతో శ్రోతల్ని అలరించారు. దాంతో పాటు... కరోనాపై పోరాటం చేయడానికి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 52 కోట్లు పోగయ్యాయి. వీటిని కరోనా సహాయ నిధికి అందించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు ఆన్ లైన్ లో వీక్షించడం ద్వారా సుమారు 4.3 కోట్లు వచ్చాయి.
దాతలు, ప్రకటనల ద్వారా దాదాపు 48 కోట్లు సేకరించారు. ఇందుకోసం ఫేస్ బుక్ ద్వారా విరాళాలు సేకరించారు. కరోనా విరాళాల కోసం ఫేస్ బుక్ ద్వారా జరిపిన అతి పెద్ద కార్యక్రమం ఇదే. ప్రియాంకా చోప్రా, రణవీర్ సింగ్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, విరాట్ కోహ్లీ.. మొదలైన స్టార్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. దాదాపు 40 మంది గాయనీ గాయకులు లైవ్ లో పాటలతో అలరించారు.