లాక్ డౌన్ చివరి దశకు చేరడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. సినీ రంగం విషయమే తీసుకుంటే షూటింగులకు అనుమతులు ఇస్తున్నారు. థియేటర్లు తెరిచేందుకు ఇంకా అనుమతులు ఇవ్వకపోయినా త్వరలోనే స్పష్టత వస్తుందని సినీరంగానికి చెందిన వారు ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతానికి నిర్మాతలు షూటింగులకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
అయితే గతంలో మాదిరిగా ఎక్కువ మంది సభ్యులతో షూటింగ్ చెయ్యడం, అవుట్ డోర్ లొకేషన్లలో షూటింగ్ జరగపడం కష్టం. ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్ జరపాలి కాబట్టి మొదటి రెండు మూడు నెలల్లో ఇన్ డోర్ షూటింగులను ప్లాన్ చేసుకుంటున్నారట. ప్రైవేటుగా ఉండే ప్రాపర్టీలతో పాటుగా స్టూడియోలలో అయితే షూటింగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్టార్ హీరోలు, నిర్మాతలు భావిస్తున్నారట. తెలుగు ఫిలిం మేకర్లే కాకుండా బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు రామోజీ ఫిలిం సిటీ అయితే షూటింగులో పాల్గొ నేందుకు రెడీ అంటున్నారట.
దీనికి కారణం ఏంటంటే ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ఎక్కడ షూటింగ్ చేసినా రిస్క్ ఎక్కువ. అదే రామోజీ ఫిలిం సిటీ లాంటి లొకేషన్ అయితే హైదరాబాద సిటీకి శివార్లలో ఉండడంతో ఇబ్బందులు ఉండవు. పైగా బయటి వారికి అనుమతి ఉండదు కాబట్టి రిస్క్ తగ్గుతుందని భావిస్తున్నారట. అన్నీ వసతులు ఉన్నాయి కాబట్టి షూటింగులకు ఆటంకం ఉండదని అంటున్నారట. అందుకే పలువురు హిందీ నిర్మాతలు రామోజీ ఫిలిం సిటీలో షూటింగులకు బుక్ చేసుకుంటున్నారట.