నటీనటులు : సుశాంత్, చాందిని చౌదరి, సిమ్రన్ చౌదరి తదితరులు
దర్శకత్వం : రాఘవేంద్ర వర్మ
నిర్మాతలు : విశ్వాస్
సంగీతం : జోష్ బి
సినిమాటోగ్రఫర్ : సతీష్
ఎడిటర్: గౌతమ్ రాజు
రేటింగ్: 2/5
చిన్న సినిమాలకు కొత్తదనమే పెట్టుబడి. ఎందుకంటే.. ఆ సినిమాల్లో స్టార్స్ ఉండరు. హంగులూ ఆర్భాటాలూ కనిపించవు. మాట్లాడుకోవడానికి పెద్ద మేటరేం ఉండదు. అందుకే కొత్త పాయింట్ తో రావాల్సిందే. `బొంభాట్` ఓ చిన్న సినిమా. ట్రైలర్ చూస్తే.. ఇందులో విషయం ఏదో ఉన్నట్టే ఉంది అనిపించింది. మరి.. నిజంగానే `బొంభాట్`లో కొత్త మేటర్ ఏమైనా ఉందా? లేదంటే.. అది ట్రైలర్ చేసిన జిమ్మిక్కా..? అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న `బొంభాట్` ఎలా వుంది?
* కథ
విక్కీ (సాయి సుహాంత్) దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడు. పుట్టిన క్షణమే.. తండ్రికి పక్షపాతం లాంటిది వస్తుంది. జాతకం చూపించడానికి జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్తే... జ్యోతిష్యుడి భార్య ఇంకెవరితోనో వెళ్లిపోతుంది. విక్కిని చూసినా, కలిసినా, మాట్లాడినా దరిద్రం జేబులో పెట్టుకుని వచ్చినట్టే. అందుకే తనని అందరూ దూరం పెడతారు. ఇలాంటి దశలో.... ఓ సెంటిస్ట్ తో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరి మధ్య వయసు తేడా ఉన్నా - ఫ్రెండ్‌షిప్ పెరుగుతుంది. పెరిగి పెద్దయ్యాక... తొలి చూపులోనే చైత్ర (చాందిని చౌదరి)ని ఇష్టపడతాడు.
తానూ ఓకే అంటుంది. కానీ ఈ దురదృష్టం భరించలేక.. గొడవ పడి, దూరం అవుతుంది. ఈలోగా విక్కీ జీవితంలోకి మాయ (సిమ్రాన్ చౌదరి) ప్రవేశిస్తుంది. ఎలాంటి ఎమోషన్ లేని మాయ విక్కీకి విచిత్రంగా కనిపిస్తుంది. అయితే మాయ మనిషి కాదని, ఓ రోబో అన్న విషయం తరవాత అర్థం అవుతుంది. ఇంతకీ మాయని అలా తయారు చేసింది ఎవరు? ఆమె వెనుక ఉన్న కథేమిటి? అన్నది తెరపై చూడాలి.
* విశ్లేషణ
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ అనే పాయింట్ పై తయారు చేసుకున్న కథ ఇది. మనుషుల్లా ప్రవర్తించే రోబోని తయారు చేస్తే ఏమవుతుంది? ఆ రోబోకి ఫీలింగ్స్ వస్తే ఎలా ఉంటుంది? అనే అంశం చుట్టూ కథ నడుస్తుంది. అయితే... ఈ పాయింట్ విన్న వెంటనే మనకు రజనీకాంత్ `రోబో` గుర్తొస్తుంది. అయితే... ఈ సినిమాకి అంత సీన్ లేదు. ఎందుకంటే.... రోబోలో ఉన్న కొత్త పాయింట్ ఈ సినమాలో లేదు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ అన్న పాయింట్ ని చెప్పాలనుకుంటే, దర్శకుడు అక్కడి నుంచి కథ మొదలెపెట్టాలి. ఓ దురదృష్ట జాతకుడి కథ చెప్పాలంటే పోనీ.. అదైనా పూర్తిగా చెప్పాలి. మొదటి సగం... హీరో దురదృష్టం చుట్టూ సాగితే, రెండో సగంలో గానీ రోబో రాదు. ఏ కథ చెప్పాలని, ఏ కథతో దర్శకుడు సినిమా మొదలెట్టాడో అర్థం కాదు. ద్వితీయార్థంలో గానీ.. అసలు పాయింట్ లోకి కథ వెళ్లదు.
లాజిక్ మొదలైతే డ్రామా అంతం అవుతుంది.. డ్రామా మొదలైతే.. లాజిక్ ముగుస్తుంది అనే హిచ్ కాక్ చెప్పిన సూత్రం సినిమా మొదలవ్వక ముందే కనిపిస్తుంది. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ సినిమాలో లాజిక్ లేదు, డ్రామా లేదు. సైన్స్ ఫిక్షన్‌లకు లాజిక్ లతో పనిలేదు అని దర్శకుడు అనుకుంటే అది తన పొరపాటే. రోబో.. మనిషిలానే బాధ పడి, మనిషిలానే ప్రేమిస్తే...? అనే పాయింట్ ని సైతం దర్శకుడు ప్రతిభావంతంగా చెప్పలేకపోయాడు. సైన్స్ ఫిక్షన్ లో సినిమా తీసినా... దానిపైనా సరిగా వర్క్ చేయలేదు. హీరో లవ్ ట్రాక్, రోబో వచ్చాక మొదలైన లవ్ ట్రాక్... ఇవి రెండూ భారంగా నడుస్తాయి, కథని ఎలివేట్ చేసే సీన్లు గానీ, పాత్రలు గానీ లేవు. దాంతో ఈ సినిమా అటు ఎమోషన్‌కీ, ఇటు లాజిక్ కీ అందకుండా పోయింది.
* నటీనటులు
ఈ నగరానికి ఏమైందిలో నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు సాయిసుహాంత్. అయితే హీరోకి తగినంత పొటన్షియాలిటీ ఇంకా రాలేదనిపిస్తుంది. చాందిని చౌదరి ఎప్పటిలానే క్యూట్ గా కనిపించింది. తొలిసారి తనతో స్టెప్పులు కూడా వేయించారు. సిమ్రాన్ చౌదరిలో ఎక్స్‌ప్రెషన్స్ పలకలేదు. రోబోలు అలానే ఉంటాయి కాబట్టి... సర్దుకుపోవొచ్చు. సైంటిస్టులిద్దరూ ఓవరాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. భరణి, హేమ కీలక పాత్రల్లో కనిపించారు. ప్రియదర్శి నవ్వించలేకపోయాడు.
* సాంకేతిక వర్గం
పాటల పరంగా ఓకే. రెండు మెలోడీ గీతాలు, వాటి చిత్రీకరణ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా కొన్ని చోట్ల ఆహ్లాదకరంగా సాగింది. దర్శకుడు రాసుకున్న కథ, కథనంలోనే లోపాలున్నాయి. కొత్తగా మొదలెట్టి, ఓ రొటీన్ కథే చెప్పాడు. అటు దురదృష్టవంతుడి కథకీ న్యాయం చేయలేకపోయాడు. రోబో తన జీవితంలో ప్రవేశించాక... తన జాతకం మారిందని చూపించినా బాగుండేది. రొటీన్ సన్నివేశాలు, బోరింగ్ స్క్రీన్ ప్లేతో.. విసిగించాడు.
* ప్లస్ పాయింట్స్
పాటలు
* మైనస్ పాయింట్స్
కథనం
బోరింగ్ సీన్స్
* ఫైనల్ వర్డిక్ట్: బొంభాట్... ఫట్