ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమంటారు పెద్దలు. సినిమా ప్రియులకూ ఇలాంటి సామెతే ఒకటుంది. రివ్యూలు చూసి, సినిమా చూడమంటూ. ఓ సినిమా జయాపజయాల్ని, వసూళ్లనీ, ఫుట్ ఫాల్స్‌నీ ఈ రోజుల్లో రివ్యూలే నిర్ణయిస్తున్నాయి. మంచి రేటింగ్ ఉన్న సినిమాల్ని ఎంచుకొని మరీ థియేటర్లకు వెళ్తున్నారు సినీ ప్రియులు. అందుకే రివ్యూలను బట్టే రెవిన్యూ డిసైడ్ అవుతోంది. కాకపోతే ఇలాంటి ట్రెండ్ లో కూడా కొన్ని సినిమాలు రివ్యూల్ని దాటుకొని మరీ నిలబడుతున్నాయి. తక్కువ రేటింగులు వచ్చినా, బాక్సాఫీసు దగ్గర నిలబడగలుగుతున్నాయి.
ఈ సంక్రాంతికి వచ్చిన 'గుంటూరు కారం' అది పెద్ద ఉదాహరణ. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. జనవరి 11 అర్థరాత్రి షో నుంచే టాక్ బయటకు వచ్చేసింది. సినిమా బాగోలేదని, త్రివిక్రమ్ - మహేష్ కాంబో స్థాయికి తగినట్టు లేదని రివ్యూలు తేల్చేశాయి. ఏ వెబ్ సైట్ చూసినా 2.5కి మించిన రేటింగులు లేవు. దాంతో మహేష్ సినిమా డిజాస్టర్ అయిపోవడం ఖాయం అనుకొన్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా పుంజుకొంది. ఫ్యామిలీ ఆడియన్స్ రివ్యూల్ని పట్టించుకోకపోవడం ప్లస్ గా మారింది. మొత్తానికి మహేష్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
అల్లు అర్జున్ 'పుష్ష'నే తీసుకొందాం. రిలీజ్ రోజున డివైడ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. కానీ క్రమంగా సినిమా నిలబడింది. నెగిటీవ్ రివ్యూల్ని దాటుకొని ఊహించని ఫలితాన్ని అందుకొంది. అఖరికి బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా తెచ్చి పెట్టింది. 'యానిమల్' పరిస్థితీ అంతే. ఈ సినిమా పెద్దగా ఎవరికీ ఎక్కలేదు. బూతులు, అశ్లీలత తప్ప ఏం లేదన్నారంతా. కానీ యూత్ కి మాత్రం బాగా ఎక్కేసింది. దాంతో ఏకంగా 900 కోట్లు సాధించింది.
నెగిటీవ్ రివ్యూలతోనే ఈ చిత్రాలు ఇంతింత వసూళ్లు అందుకొన్నాయంటే, వీటికి కాస్త పాజిటీవ్ రివ్యూలు వస్తే ఇంకెలా ఉండేదో..?