నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిదీ హ్యాట్రిక్ కాంబో. కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయి. కాకపోతే... అటు బాలయ్య, ఇటు బోయపాటి ఇద్దరూ `లో` లోనే ఉన్నారు. బాలయ్యకు వరుస ఫ్లాపులు తగిలాయి. ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ హ్యాండిచ్చింది. రూలర్ అట్టర్ ఫ్లాప్. బోయపాటి సినిమాకీ గత సినిమా ఫ్లాపే. వినయ విధేయ రామాతో చాలా విమర్శలు ఎదుర్కోవాల్సివచ్చింది. దాంతో బాలయ్య సినిమాని హిట్టు చేయక తప్పని పరిస్థితి. ఈమధ్యే ఈ సినిమా పట్టాలెక్కింది. కానీ... లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. ఈ లాక్ డౌన్ ఈ సినిమాకి మంచి చేసినట్టే కనిపిస్తోంది. స్క్రిప్టుని పకడ్బందీగా రాసుకోవడానికి బోయపాటి కి తగిన సమయం దొరికింది.
లాక్ డౌన్ సమయంలో బోయపాటి స్క్రిప్టుని మళ్లీ రీరైట్ చేశాడట. బాలయ్య పాత్రలో కొత్త మార్పులు కనిపించబోతున్నాయని టాక్. ఇది వరకు రాసుకున్న పాత్రకీ, ఇప్పటి పాత్రకీ చాలా తేడా ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య అఘోరా గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర తీరు తెన్నులో బోయపాటి కీలకమైన మార్పులు చేశాడని సమాచారం. ఈ మార్పులు బాలయ్యకు కూడా నచ్చాయని తెలుస్తోంది. బోయపాటి ఓ సారి స్క్రిప్టు రెడీ చేశాక మార్చడానికి ఇష్టపడడు. బాలయ్య కూడా అంతే. ముందు చెప్పిన కథే తీయాలి. అయితే ఈసారి మాత్రం ఇద్దరూ రూటు మార్చారు. మరి.. ఈ మార్పు ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందో?