ఈమధ్య మన తెలుగు సినిమా బడ్జెట్‌కి రెక్కలొచ్చేశాయ్. సెకండ్ టైర్ హీరోల సినిమాలకు సైతం 40, 50 కోట్లు ఈజీగా పెట్టేస్తున్నారు. ఇది వరకు రామ్ తో సినిమా అంటే రూ.25 నుంచి రూ.30 కోట్లలో తేలిపోయేది. అయితే రామ్ కూడా రూటు మార్చాడు. తన సినిమాల బడ్జెట్ అమాంతంగా పెంచేశాడు. రామ్ - లింగు స్వామి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `ది వారియర్` అనే టైటిల్ పెట్టారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాపై ఇప్పటి వరకూ 70 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు టాక్. రామ్ తో రూ.70 కోట్లంటే చాలా పెద్ద మాటే. అయితే రామ్ ఇక్కడితో ఆగలేదు. తన తదుపరి సినిమా రూ100 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోనుంది.
రామ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి రూ,100 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నారని టాక్. ఇక నుంచి రామ్ సినిమాలన్నీ వంద కోట్లపైమాటేనట. అలాంటి కథలే రామ్ వింటున్నాడట. రామ్ - బోయపాటి సినిమా అయితే రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే... బోయపాటి కి పెద్ద పెద్ద హిట్లున్నాయి. అఖండ భారీ వసూళ్లు అందుకుంది. బోయపాటి సినిమా హిట్టయితే ఆ రేంజే వేరు. అయితే అందరికీ ఇంత కెపాసిటీ ఉండదు. లింగుస్వామి హిట్టు కొట్టి చాలా కాలమైంది. తెలుగులో తనకిదే తొలి సినిమా. అలాంటప్పుడు రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్న పని. వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టులు సెట్ అయ్యేసరికి.. తనకు వంద కోట్ల కథలే కావాలని రామ్ అడగడం కూడా సవ్యంగా లేదు. ది వారియర్ సినిమా హిట్టయితే.. రామ్ పై వంద కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు వస్తారేమో. అదే తేడా కొడితే అంతే సంగతులు.