కరోనా కారణంగా... పరిస్థితులన్నీ మారిపోయాయి. ప్రపంచంమొత్తం.. `కరోనాకి ముందు - కరోనా తరవాత` అన్నట్టు విభజించి చూడాల్సివస్తోంది. సినిమా పరిశ్రమ కూడా అందుకు అతీతం కాదు. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ తగ్గించుకోవడం అత్యవసరం. కొన్ని పెద్ద సినిమాలు బడ్జెట్ తగ్గించుకునే విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్నాయి. అందులో.. `పుష్ష` ఒకటి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం `పుష్ష`.
రంగస్థలం లాంటి సూపర్ హిట్ తరవాత సుకుమార్, అల వైకుంఠపురం లాంటి ఇండ్రస్ట్రీ హిట్ తరవాత బన్నీ చేస్తున్న సినిమాలు కావడంతో... అంచనాలు పెరుగుతాయి. దాంతో పాటు బడ్జెట్ కూడా. ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే... నిర్మాతలు ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ. కాబట్టి బడ్జెట్ పరిమితులు లేవు. కాకపోతే... ఈ కాంబో కరోనాకి ముందు సెట్టయ్యింది.కరోనా తరవాత.. చిత్రసీమకు వచ్చే ఆదాయం ఎలా ఉండబోతోందో... జనాలు థియేటర్లకు వస్తారో రారో, అసలు ఇది వరకు పరిస్థితులు కనిపించడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో.. బడ్జెట్ తగ్గించుకుంటే రిస్కు కూడా తగ్గుతుంది. అందుకే `పుష్ఫ` బడ్జెట్ తగ్గించాలని నిర్మాతలు సుకుమార్‌ని కోరుతున్నార్ట. సుకుమార్ సంగతి తెలిసిందే. ఏదీ ఓ పట్టాన పూర్తవదు.
ఈ సినిమాని అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న సమయానికి పూర్తి చేస్తే... గొప్ప అన్నట్టు తయారైంది వ్యవహారం. ఇప్పుడు సుకుమార్ ముందు రెండు పెద్ద బాధ్యతలున్నాయి. ఒకటి.. అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయడం, దాంతో పాటు బడ్జెట్ కంట్రోల్ చేయడం. మరి.. ఆయనేం చేస్తాడో? పుష్ష ని ఎలా కాపాడతాడో??