మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య మూస కథల్ని ఎంచుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. కథలే కాదు, తన సినిమాల్లోని షాట్స్ కూడా ఒకేలా ఉంటున్నాయి, కాస్టింగ్ కూడా పోల్చుకునేలా ఉంటోందనే ప్రచారం ఉంది. 'అత్తారింటికి దారేది' సినిమాతో త్రివిక్రమ్ సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఇక అప్పటి నుండీ అదే ఫార్ములాని తన సినిమాల్లో చూపిస్తున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. వినిపించడమే కాదు, అచ్చం అలా పోల్చుకునేలానే క్యారెక్టర్ డిజైన్స్ ఉంటున్నాయి. ఆ సినిమా దగ్గర నుండీ, 'అ' అనే సెంటిమెంట్ టైటిల్‌లో కామన్‌గా వాడుతున్నాడు. ఇక క్యారెక్టర్స్ ఎంచుకోవడం కూడా అదే తీరులో ఉంటోంది. కథకూ దగ్గర పోలికలే ఉంటున్నాయి. 'అరవింద సమేత..', 'అజ్ఞాతవాసి', ఇప్పుడు 'అల వైకుంఠపురములో..' వరకూ చాలా దగ్గర పోలికలు చూపిస్తున్నాడు. దాంతో నెటిజన్స్‌కి త్రివిక్రమ్ టార్గెట్ అయిపోతున్నాడు.
ఇక తాజాగా వచ్చిన 'అల వైకుంఠపురములో..' సినిమా విషయంలో త్రివిక్రమ్‌ని బాగా ఆడేసుకుంటున్నారు. ఈ ఆట దేనికి దారి తీస్తుందో తెలీదు కానీ, త్రివిక్రమ్ ఇలా ఎందుకు చేస్తున్నాడో అని ఆయన అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. లేటెస్ట్‌గా రిలీజైన 'అల..' టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తున్నా, అదంతా అల్లు అర్జున్ దయ వల్లే. సినిమాని త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేశాడో అనే అనుమానాలు బన్నీ ఫ్యాన్స్‌ని టెన్షన్ పెట్టేస్తున్నాయి.