తారాగణం: సందీప్ కిషన్, మెహరీన్, సత్య, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, అప్పుకుట్టి తదితరులు
సంగీతం: డి. ఇమ్మాన్
సినిమాటోగ్రఫీ: జె.లక్ష్మణ్‌కుమార్
దర్శకత్వం: సుసీంద్రన్
నిర్మాత: చక్రి చిగురుపాటి
నిర్మాణం: లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్
యావరేజ్ యూజర్ రేటింగ్: 3/5
'నా పేరు శివ' సినిమాలో హీరో కార్తి రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపిస్తాడు. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ కుర్రాడి జీవితంలో అనుకోని పరిస్థితులు, అతని జీవితాన్ని ఎలా మార్చాయి? అన్నదే ఆ సినిమా. ఆ సినిమా దర్శకుడు సుశీంద్రన్, సందీప్ కిషన్‌తో చేసిన ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి 'నా పేరు శివ' సక్సెస్ కూడా ఓ కారణం.
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాకి స్నేహాన్ని నేపథ్యంగా ఎంచుకున్నాడు దర్శకుడు. మరి ఈ సినిమాతో ఇంకోసారి దర్శకుడు సుసీంద్రన్ మ్యాజిక్ చేశాడా? సందీప్ కిషన్ - సుసీంద్రన్ కాంబినేషన్ వర్కవుట్ అయ్యిందా?
కథా కమామిషు..
కథలోకి వెళ్ళిపోదామిక! స్నేహానికి ప్రాణమిచ్చే సూర్య (సందీప్ కిషన్), ఎంబీఏ ఫెయిలయి, క్యాటరింగ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. చెల్లెలు వైద్య విద్యలో మాస్టర్ డిగ్రీ కోసం ప్రయత్నిస్తుంటుంది. ఆమెకీ సూర్య స్నేహితుడు మహేష్ (విక్రాంత్)కీ మధ్య ప్రేమ వ్యవహార నడుస్తుంటుంది. అది సూర్యకి తెలుస్తుంది. ఇంకో వైపున రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయంపై దాడి కేసులో మహేష్‌పై అభియోగాలు నమోదవుతాయి. తనకు తెలిసిన అధికారితో మహేష్‌ని సూర్య అరెస్ట్ చేయిస్తాడు. మహేష్ జైలు నుంచి వచ్చాక కూడా అతనిపై హత్యాయత్నం జరుగుతుంది. ఇవన్నీ సూర్యనే చేయించాడా? ఇంకెవరనా మహేష్ మీద కక్ష కట్టాడా? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే చూడాలి.
నటీనటులెలా చేశారు...
సందీప్ కిషన్ మంచి నటుడు. విలక్షణ పాత్రలు దొరికితే నటుడిగా తన సత్తా చాటగలడు. ఈ సినిమాలో సందీప్ కిషన్‌కి మంచి పాత్ర దక్కింది. యాక్షన్ సన్నివేశాల్లోనూ, ఏమోషన్ పండించే సందర్భంలోనూ మంచి టాలెంట్ ప్రదర్శించాడు సందీప్ కిషన్. నటుడిగా ఈ సినిమాతో అతనికి మంచి మార్కులు పడతాయి.
హీరోయిన్ మెహరీన్ మరోమారు క్యూట్‌గా తెరపై కన్పించింది. నటనకు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర ఆమెది. ఉన్నంతలో అందంగా ఆకట్టుకుంటుందంతే.
మహేష్ పాత్రలో విక్రమన్ బాగా చేశాడు. హరీష్ ఉత్తమన్ విలనిజం బాగా పండింది. సత్య, ప్రవీణ్ తదితరులు కొంతమేర హాస్యం పండించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ నవ్వులు అంతగా ఆకట్టుకోవు. మిగతా పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.
విశ్లేషణ..
సాఫీగా సాగిపోతున్న కథలో, ఓ క్రైమ్ ఎలిమెంట్‌ని జోడించి మొత్తంగా సినిమా మూడ్‌నే మార్చేయడం సుసీంద్రన్ ప్రత్యేకత. ఇక్కడా అదే జరిగింది. అయితే సాఫీగా సాగిపోతున్న సమయంలో సరైన ఎంటర్‌టైన్‌మెంట్ పడి ఉండాల్సింది. అదే కాస్త తగ్గింది. క్రైమ్ ఎలిమెంట్స్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి సాంకేతిక విభాగాల్ని దర్శకుడు బాగా వాడుకున్నాడు. వినోదం పాళ్ళు తగ్గడంతో సినిమా అన్ని వర్గాల ప్ష్రేక్షకుల్నీ మెప్పించలేకపోవచ్చు. ఈ తరహా థ్రిల్లర్ సినిమాల్ని నచ్చేవారికి మాత్రం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు..
టెక్నికల్‌గా సినిమా బాగుంది. లక్ష్మణ్‌కుమార్ సినిమాటోగ్రఫీకి డి.ఇమ్మాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఎడిటింగ్ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. మాటలు బాగున్నాయి. నిర్మాణపు విలువల విషయంలో ఎక్కడా రాజీపడలేదు. స్క్రీన్‌ప్లే సుసీంద్రన్ స్టయిల్లో కొనసాగింది.
ఫైనల్ వర్డ్: స్నేహం ప్లస్ థ్రిల్లర్ దటీజ్ సూర్య