ఇప్పటి వరకూ షూటింగులు మొదలవ్వక ఇబ్బందులు పడ్డారు హీరోలు. ఇప్పుడు అనుకోకుండా షూటింగులలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కరోనా నిబంధలన్ని పాటించడం చాలా కష్టంగా మారుతోంది. షూటింగ్ సెట్లో కనిపిస్తున్న కొత్త వాతావరణానికి అలవాటు పడడం మరింత ఇబ్బందిగా మారుతోంది. దాంతో కొత్త తలనొప్పులు వస్తున్నాయి.
తాజాగా అమీర్‌ఖాన్‌కీ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అమీర్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా `లాల్ సింగ్ చద్దా`. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో కొత్త షెడ్యూల్ మొదలైంది. అక్కడ కొంత భాగం తెరకెక్కించారు. అయితే.. షూటింగ్ సమయంలో అమీర్ ఖాన్ లాక్ డౌన్ నిబంధనల్ని బేఖాతరు చేశారని, అభిమానులతో సెల్ఫీలు దిగారని, భౌతిక దూరం ఏమాత్రం పాటించకుండా షూటింగ్ చేశారని ఆరోపణలు వినిపించాయి. దానికి తోడు స్థానిక ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ అమీర్ ఖాన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ చిత్రానికి అమీర్‌ఖానే నిర్మాత. కాబట్టి... ఆయనే జవాబు దారీ. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా షూటింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని ప్రభుత్వాధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అమీర్ ఖాన్ నిబంధనల్ని ఉల్లంఘించాడని నిరూపిస్తే.. అమీర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.