వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉంటాడు. ఆయనపై క్లీన్ చీట్ ఉంది. అయితే... తొలిసారి వెంకటేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కోర్టు కేసులో చిక్కుకొన్నారు. వెంకటేష్, సురేష్‌బాబు, ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో వెంకటేష్‌కు ఓ స్థలం ఉంది. అది లీజుకి ఇచ్చారు. అయితే లీజు దారుడికీ, దగ్గుబాటి కుటుంబానికీ వివాదాలు మొదలయ్యాయి. స్థలంలో కట్టుకొన్న భవనాన్ని కూల్చి, ఫర్మిచర్ పట్టుకెళ్లారని నందకుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నటుడు దగ్గుబాటి వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. ఇప్పుడు వెంకటేష్ కుటుంబం లాయర్లని సంప్రదించి, ఈ కేసు నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తోంది.
ఎప్పుడూ ఎలాంటి వివాదాలలోనూ జోక్యం చేసుకోని వెంకటేష్ ఇప్పుడు ఈ గొడవలో దిగడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. వీలైనంత త్వరగా, సామరస్యపూర్వకంగా ఈ కేసు నుంచి బయటపడాలని దగ్గుబాటి కుటుంబం భావిస్తోంది.