నటీనటులు : మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్ తదితరులు
దర్శకత్వం : జెఫ్రీ జి చిన్
నిర్మాతలు : మంచు విష్ణు
సంగీతం : స్యామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫర్ : షెల్డన్ చావ్
ఎడిటర్: గౌతమ్ రాజు
రేటింగ్: 2.5/5
చాలా ఏళ్లుగా హిట్టు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మంచు విష్ణు. మధ్యలో కొంత గ్యాప్ కూడా తీసుకున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందే అనే తపనతో చేసిన సినిమా `మోసగాళ్లు`. ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్లు ఖర్చు పెట్టానని ఘనంగా చెప్పుకున్నాడు విష్ణు. బాలీవుడ్ నుంచి సునీల్ శెట్టినీ తీసుకొచ్చాడు. గ్లామర్ క్వీన్ కాజల్ ని.. అక్క పాత్రలో చూపించే సాహసం చేశాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాకి కథ తానే రాసుకున్నాడు. ఇన్ని ప్రత్యేకతలు, ఆవశ్యకతల మధ్య `మోసగాళ్లు` ఏం చేసింది? విష్ణు ఎదురు చూసిన విజయం అందిందా? లేదా?
* కథ
అను, అర్జున్ (కాజల్, విష్ణు) ఇద్దరూ కవలలు. సాంకేతికంగా చెప్పాలంటే అనునే పెద్ద. కటిక పేదరికం చవిచూశారిద్దరూ. తండ్రి నిజాయితీ వల్లే పేదరికం అనుభవించాల్సివచ్చిందని వాళ్ల ఫీలింగ్. పెరిగి పెద్దయ్యాక బాగా డబ్బులు సంపాదించాలనుకుంటారు. అందుకోసం అడ్డదారులు తొక్కడం, డబ్బున్న వాళ్లని మోసం చేయడం తప్పు కాదనుకుంటారు. అందుకే.. ఓ భారీ స్కామ్ ప్లాన్ చేస్తారు. ఆ రూపంలో కోట్లకు కోట్లు సంపాదిస్తారు. ఇంతకీ ఆ స్కామ్ ఏమిటి? దాన్ని ఎలా అమలు చేశారు? కోట్లు ఎలా వెనకేశారు? చివరికి దొరికారా? లేదా? అనేదే కథ.
* విశ్లేషణ
ఇది నిజంగా జరిగిన కథ అని విష్ణు చెబుతున్నాడు. ముంబైలోని ఓ కాల్‌సెంటర్ కంపెనీ.. ఇలానే అమెరికన్లని మోసం చేసి, వేల కోట్లు ఆర్జించి, చివరికి దొరికిపోయింది. దాన్ని ఆసరాగా చేసుకుని అల్లుకున్న కథ ఇది. పాయింట్ కొత్తగా ఉంది. `ఇలాక్కూడా మోసం చేస్తారా` అనిపించేలా ఉంది. ఆ రకంగా విష్ణు ఆలోచన మంచిదే. కానీ.. ఆచరణ మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యింది. క్రైమ్ కథల్లో ఉత్కంఠత చాలా అవసరం. ఏం జరుగుతుందో? అనే ఆసక్తి ప్రేక్షకులలో కలిగించాలి. మోసం చేస్తున్న హీరో.. దొరికేస్తాడా, లేదా? అని గుడ్లప్పగించి చూడాలి. ఆ ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. తెరపై ఏదేదో జరిగిపోతుంటుంది. కానీ.. అవేం ప్రేక్షకులకు థ్రిల్ కలిగించవు.
కొన్ని సన్నివేశాలు చూస్తే.. కథకుడు, దర్శకుడు ఈ సినిమాపై ఎలాంటి కసరత్తూ చేయలేదేమో అనిపిస్తుంది. ఫోన్లు చేసి, మీరు టాక్స్ కట్టలేదు... అర్జెంటుగా కట్టేయాలి... అంటే, ఎవరైనా కట్టేస్తారా? ముందూ వెనుకా చూసుకోరా? పైగా అమెరికన్ వ్యవస్థ, అక్కడి ప్రభుత్వాలూ ఎంత బలమైనవో తెలుసు. ఏదైనా ఓ నేరం జరిగితే క్షణాల్లో వాళ్లని పట్టుకునేంత వ్యవస్థ అమెరికన్ పోలీసులకు ఉంది. అలాంటిది.. ఇండియా నుంచి ఓ కాల్ సెంటర్ కంపెనీ.. వేలాది మంది అమెరికన్లని మోసం చేస్తుంటే.. నిమ్మకునీరెత్తినట్టు ఉంటుందా? ఈ కేస్ డీల్ చేయడానికి లోకల్ పోలీసుల సహాయం తీసుకుంటుందా? ఇదంతా ఎంత పేలవంగా ఉందో?
మోసం జరగడం ఒక ఎత్తు. మోసగాళ్లని పట్టుకోవడం మరో ఎత్తు. అవన్నీ మైండ్ గేమ్ తో సాగాల్సిన సన్నివేశాలు. ఈ స్కామ్ ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ సునీల్ శెట్టి చేసే విన్యాసాలు, ఎత్తుగడలు ఏమాత్రం ఆకట్టుకోవు. క్లైమాక్స్ మరీ.. ఊహాజనితంగా ఉంటుంది. ట్విస్టులు కరువై, ఉత్కంఠత లేకుండా.. చాలా సాదాసీదాగా కథని నడిపి, ఇదే థ్రిల్ అనుకోమంటే ఎలా? చాలా చోట్ల దర్శకుడు లాజిక్కులు వదిలేశాడు. పాత్రల్ని సరిగా డీల్ చేయలేదు. దాంతో మోసగాళ్లు ఏమాత్రం ఆసక్తి కలిగించదు.
* నటీనటులు
విష్ణు నటన చాలా సాదాసీదాగా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో మరీ.. నీరసంగా చేసుకుంటూ పోయాడు. కాజల్ ఓకే. కాకపోతే.. ద్వితీయార్థంలో కాసేపు ఏమాత్రం కనిపించకుండా పోతుంది. ఈ మాత్రం పాత్రకోసం సునీల్ శెట్టిని ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాదు. ఆయన యాక్షన్ ప్రత్యేకంగా ఉంటుందని, ఈ పాత్ర ఆయన మాత్రమే చేయగలరని ప్రచారంలో కోతలు కోశారు. అవన్నీ ఇప్పుడు తేలిపోయాయి. నవీన్ చంద్ర కొన్ని చోట్ల తన సహజసిద్ధమైన దారిని విడిచి అతి చేశాడు. నవదీప్ ఆకట్టుకున్నాడు.
* సాంకేతిక వర్గం
కథలో పాయింట్ బాగుంది. కానీ దాన్ని ఆసక్తికరంగా మలిచే స్క్రీన్ ప్లే కుదరలేదు. కథనంలో దమ్ము లేదు. వేగం అసలే లేదు. లాజిక్ లు మర్చిపోయారు. సాంకేతికంగానూ గొప్పగా లేదు. ఈ సినిమా కోసం 50 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడం ప్రచారం కోసం చేసిన ఆర్భాటం అనిపిస్తుంది. ఈ సినిమాకి హాలీవుడ్ దర్శకుడ్ని ఎందుకు ఎంచుకున్నారో విష్ణుకే తెలియాలి.
* ప్లస్ పాయింట్స్
కథలో పాయింట్
తారాగణం
* మైనస్ పాయింట్స్
కథనం
లాజిక్ లేకపోవడం
ట్విస్టులు కరువవ్వడం
* ఫైనల్ వర్డిక్ట్: మోసం - దగా