సంక్రాంతికి బాలయ్యకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. సంక్రాంతికి విడుదలైన సినిమాలతో సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టాడు బాలకృష్ణ. జనవరి 12న బాలయ్య వందో చిత్రంగా రూపొందుతోన్న 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంక్రాంతికి మూడు రోజుల ముందే ఏపీ ప్రభుత్వం ఈ చిత్ర యూనిట్‌కి తీపి కబురు చెప్పింది. ఈ సినిమాపై వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది. ఇది సంక్రాంతికి బాలయ్యకు చంద్రబాబు ఇస్తోన్న గిఫ్ట్ అనే చెప్పొచ్చు. ఇంతకు ముందే తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. తెలుగువారంతా గర్వపడే సినిమా ఇది. అందుకే ఈ విషయాన్ని ముందుగానే గమనించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ సినిమా కాకపోయినా, ఈ సినిమా కు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాకు పన్ను మినహాయింపు చాలా పెద్ద ప్లస్ కానుంది. అమరావతి కేంద్రంగా పాలించిన రాజు శాతకర్ణి చరత్రను సినిమా ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్న బాలయ్యను చంద్రబాబు అభినందిస్తూ ఈ ప్రోత్సాహాన్నిచ్చారు. నిజమే ఇలాంటి ప్రోత్సాహం ఈ తరహా కథలకి ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాంటప్పుడే మరిన్ని మంచి సినిమాలు మన టాలీవుడ్‌ని పలకరిస్తాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముద్దుగుమ్మ శ్రియ శాతకర్ణి భార్యగా నటిస్తోంది. ఈ సినిమాలో ఈమె నటన అత్యద్భుతంగా ఉండనుంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ హేమామాలిని కీలకపాత్రలో నటిస్తోన్న చిత్రమిది.