రాజకీయంగా, సిద్ధాంత పరంగా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బద్ద శత్రువులు. కానీ... ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ విషయం వాళ్లే చాలాసార్లు చెప్పారు. కాలేజీ రోజుల్లో ఇద్దరూ చెట్టా పట్టాలేసుకుని తిరిగినవాళ్లే. ఇప్పుడు వీరిద్దరి స్నేహాన్ని తెరపై చూపించాలనుకుంటున్నారు దేవాకట్టా. వీరిద్దరి కథకు `ఇంద్ర ప్రస్థం` అనే టైటిల్ పెట్టారు. ఈ కథకు ఒక్క భాగంలో చెప్పడం కుదర్దట. అందుకే మూడు భాగాలుగా తీయాలన్నది ఆయన ఆలోచన.
ఈ ప్రాజెక్టు గురించి దేవాకట్టా మాట్లాడుతూ ''చంద్రబాబునాయుడుగారు, వై.ఎస్‌గారి జీవితాలను బేస్ చేసుకుని వారీ కాలేజీ జీవితాల నుంచి వై.ఎస్.ఆర్ మరణం వరకు ఉండే సినిమా. ఈ సినిమాను గాడ్‌ఫాదర్ రేంజ్‌లో మూడు భాగాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నాను. వెబ్ సిరీస్‌గానూ కూడా తెరకెక్కించవచ్చు. ఇంద్రప్రస్థం అనే వర్కింగ్ టైటిల్‌ను అనుకున్నాం. విష్ణువర్ధన్‌గారితో ఎన్టీఆర్‌గారి బయోపిక్ గురించి, ఈ కథ గురించి చర్చించాను. ఎన్టీఆర్ బయోపిక్ తన సినిమా అనేలా బయటకు వెళ్లింది. కానీ ఇంద్రప్రస్థం అనే సినిమా గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఎలా రూపొందుతుందో అందరూ ఎదురుచూస్తున్నారు. పెద్ద క్యాస్టింగ్ అవసరం. సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో విష్ణువర్ధన్‌గారు వారి జీవితాలపై సినిమాను తీస్తానని చెప్పినప్పుడు నాకేం అభ్యంతరం అనిపించలేదు. అయితే స్టోరి పరంగా నా కథలో ఎలిమెంట్స్‌ను తీసుకుంటే లీగల్‌గా చర్యలు తీసుకుంటా'' అని చెప్పారు దేవాకట్టా. ఆయన దర్శకత్వం వహించిన `రిపబ్లిక్` ఈ శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే.