రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలూ మామూలే. అది లేకపోతే రాజకీయమే లేదు. కానీ.. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. ఏది శ్రుతిమించినా మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి వ్యవహారం అలానే తయారైంది. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ స్పీచ్ ... కలకలం సృష్టించింది. పవన్ చాలామందిపై విమర్శలు చేశారు. వాళ్లంతా ప్రతి విమర్శలూ గుప్పించారు. అసలు ఈ టాపిక్ లో లేని పోసాని మైకు పట్టుకుని ప్రెస్ ముందుకొచ్చారు. నిజానికి పవన్ తన కామెంట్లలో ఎక్కడా పోసాని పేరు తీసుకురాలేదు. వైకాపా కార్యకర్తగా పోసానికి మాట్లాడే హక్కు ఉంది. కానీ అది అంత వరకే. అయితే పోసాని వ్యవహారం పూర్తిగా శ్రుతిమించిపోయింది.
తొలి రోజు ప్రెస్ మీట్లో... పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తే - రెండో రోజు డోసు పెంచారు. సైకో అంటూ పవన్ పై పోసాని విరుచుకుపడ్డారు. పంజాబీ అమ్మాయికి కడుపు చేశావ్ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. `నీ కుటుంబాన్ని తిడతా, నీ అమ్మని తిడతా` అంటూ రెచ్చిపోయారు. చివరికి చిరంజీవినీ ఈ ఇష్యూలోకి లాగారు. పోసానికి పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజీలు వస్తున్నాయని, తన భార్యపై నిందలు వేస్తున్నారన్నది పోసాని ఆరోపణ. అలాగైతే.. ఎవరైతే మెసేజీలు పెట్టారో వాళ్లపై కేసులు పెట్టాలి. పవన్ ని అని ఏం ప్రయోజనం. పవన్ నేరుగా పోసానిపై ఒక్క కామెంట్ కూడా చేయలేదు. అలాంటప్పుడు పవన్ పేరెత్తుతూ విమర్శించే హక్కు పోసానికి ఎక్కడిది? పోసాని పూర్తిగా శ్రుతి మించి వ్యాఖ్యలు చేశారన్న విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. అందుకే తిరిగి ఆయనకే చివాట్లు పడుతున్నాయి. కేవలం విషయాన్ని పక్కదారి పట్టించడానికి వేసిన రాజకీయ ఎత్తుగడ అన్నది అందరికీ అర్థమైంది. తొలి ప్రెస్ మీట్ తోనే పోసాని ఆగిపోతే... ఆయన ఏదో ఆవేశ పడ్డాడులే అనుకోవొచ్చు. కానీ రెండో ప్రెస్ మీట్లో ఆయన మరింత రెచ్చిపోవడం చూస్తుంటే, ఇది కచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గానే జరుగుతోందనిపిస్తోంది. ఈ విషయంలో పవన్ కి ఎంత మైనస్సో చెప్పలేం గానీ, పోసానికి మాత్రం చాలా పెద్ద మైనస్.