రీమేక్ సినిమాలు చేయడం అనుకున్నంత సులభం కాదు. మాతృకని మార్చాలా? వద్దా? కొత్తగా జోడింపులు అవసరమా? కాదా? అనే లెక్కలు తేలడం కష్టం. కొన్ని సార్లు మార్పులు మంచి చేస్తాయి. ఇంకొన్నిసార్లు అవే ముంచేస్తాయి. ఉన్నది ఉన్నట్టు తీస్తే కొన్ని సినిమాలు ఆడతాయి. ఇంకొన్ని.. అలా తీసినందుకే ఫ్లాప్ అవుతాయి. అందుకే రీమేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
చిరంజీవి చేతిలో ప్రస్తుతం రెండు రీమేకులు ఉన్నాయి. అందులో లూసీఫర్ ఒకటి. వినాయక్ చేయాల్సిన సినిమా ఇది. మోహన్ రాజా చేతిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆయన స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. లూసీఫర్ కథని చిరంజీవికి తగ్గట్టు మారుస్తున్నార్ట. ఆ మార్పులు భారీగానే ఉండబోతున్నాయని తెలుస్తోంది. లూసీఫర్ లో మోహన్ లాల్ పక్కన హీరోయిన్ లేదు. కానీ.. చిరు పక్కన హీరోయిన్ ఉండాల్సిందే. పాటలూ.. తప్పనిసరి. అందుకే చిరు పక్కన కథానాయిక పాత్ర పెట్టి, వాళ్ల మధ్య రొమాన్స్ కూడా జోడిస్తున్నార్ట. అంతేకాదు.. లూసీఫర్ సినిమా ఆధ్యంతం సీరియస్ గా ఉంటుంది. అంత సీరియస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు నచ్చవు. అందుకే కాస్త కామెడీ కూడా మిక్స్ చేస్తున్నారని సమాచారం. ఈ మార్పులు లూసీఫర్‌కి మేలు చేస్తాయా? లేదంటే కథని డైవర్ట్ చేస్తాయా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.