పవన్ కల్యాణ్‌కి రీమేకులు బాగా అచ్చొచ్చాయి. ఎంత రీమేక్ అయినా దాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు.. పవన్ ఇమేజ్‌కి తగ్గట్టు డిజైన్ చేసుకోవడం వల్లే ఆయా చిత్రాలు మంచి విజయాల్ని అందిచాయి. ఇప్పుడు పవన్ చేతిలో ఉన్న 'వకీల్ సాబ్' కూడా రీమేక్ కథే. బాలీవుడ్ లో మంచి విజయాన్ని, విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న చిత్రం `పింక్`. దీన్ని తెలుగులో `వకీల్ సాబ్`గా రీమేక్ చేస్తున్నారు.
అక్కడ అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో ఇక్కడ పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. నిజానికి అమితాబ్ స్థాయి వేరు, ఆయన వయసు వేరు. ఇమేజ్ వేరు. పవన్ కల్యాణ్ పై ఉండే అంచనాలు వేరు. `పింక్`ని యధాతథంగా తీస్తే - తప్పకుండా పవన్ అభిమానులకు నచ్చకపోవొచ్చు. పవన్ నుంచి ఆశించే అంశాలు ఏమాత్రం కొరవడినా ఫలితం తేడా కొట్టేస్తుంది. అలాగని కథని ఇష్టం వచ్చినట్టు మార్చడానికి వీల్లేదు. కొన్ని మార్పులు చేర్పులు అవసరం. అలాగని కథకి దూరంగా వెళ్లకూడదు. ఇది నిజంగా దర్శకుడు వేణు శ్రీరామ్‌కి కత్తి మీద సామే. పవన్ కోసం తను ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాల్ని రాసుకున్నాడట. ఇవేమీ హిందీ పింక్ లో ఉండవు. హిందీలో పింక్ చూసిన వాళ్లకు ఆవి ఏమేరకు నచ్చుతాయి? కథలో ఏమేరకు ఇమిడిపోతాయి అనేదాన్ని బట్టే వకీల్ సాబ్ విజయం ఆధార పడి ఉంటుంది. పవన్ అభిమానుల కోసం చేసిన మార్పులు పవన్ అభిమానులకు మాత్రమే నచ్చితే సరిపోదు. మిగిలినవాళ్ల హృదయాల్నీ గెలుచుకోవాలి. `పింక్` కమర్షియల్ కథ కాదు. ఇష్టం వచ్చినట్టు మార్చడానికి. కాకపోతే.. పవన్ కోసం ఆ రిస్కు చేస్తున్నాడు వేణు శ్రీరామ్. దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.