సినియర్ నటుడు నరేశ్ మాజీ భార్య రమ్య రఘుపతి పై చీటింగ్ కేసులు సంచలనంగా మారింది. ఆమె ఆర్ధిక నేరాలు సంబధించి పోలీసుల దర్యాప్తులో ఎన్నో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. నరేశ్ పేరు చెప్పి ఎంతో మంది మధ్య తరగతి వారిని నిండా ముంచారని రమ్యపై ఆరోపణల. హైదరాబాద్, బెంగళూరులో పెద్ద మొత్తంలో ఆస్తులను చూపి.. జనాల దగ్గర నుంచి డబ్బులు కూడబెట్టుకున్నారని, రమ్య నరేష్ మాజీ భార్య కావడంతో పాటు నరేష్ ఆస్తులని కూడా చూపి ఆమె అప్పులు తీసుకుందని ఆరోపణలు వుండటంతో నరేష్ పేరు కూడా ఈ వివాదంలో వినిపించింది. ఈ నేపధ్యంలో నరేష్ వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
రమ్య రఘుపతికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు నరేష్. ఈ మొత్తం వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని, ఏడేళ్ల నుంచే తానూ, రమ్య దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు.‘‘మా వివాహమై తొమ్మిదేళ్లయ్యింది. రమ్య ఈ విధంగా అప్పులు చేస్తోందని తెలిసి.. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఊహించి ఏడేళ్ళ నుంచి ఆమెకు దూరంగా ఉన్నాను. మేమిద్దరం ఆనాటి నుంచి విడివిడిగా ఉంటున్నాం. ప్రస్తుతం మా ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. ఇటీవల ఆమెపై ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని వార్తలు రావడంతో నాకు భయం వేసింది. దాంతో మూడు నెలల క్రితమే పత్రికల్లో నేను ఓ పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చాను. ఆర్థికపరమైన, ఏ ఇతర అంశాల్లోనూ రమ్యతో నాకు కానీ, నా బంధువులకు కానీ ఎలాంటి సంబంధం లేదని ఆ నోటీస్‌లో వుంది. మరోసారి చెబుతున్న నాకూ, నా కుటుంబానికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు నరేశ్