యువ కథానాయకుడు విశ్వంత్ పై చీటింగ్ కేసు నమోదైంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో... విశ్వంత్ పై ఫిర్యాదు చేశారు కొంతమంది. తక్కువ ధరకే కార్లు ఇప్పిస్తానని తమ దగ్గర డబ్బులు వసూలు చేసి, ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు విశ్వంత్. దిల్ రాజు నిర్మించిన `కేరింత`లో విశ్వంత్ హీరో. ఆ తరవాత.. మనసంతా, పిట్టకథలు చిత్రాల్లో నటించాడు. కొన్ని వెబ్ సిరీస్‌లూ చేస్తున్నాడు.
విశ్వంత్ ఓ సెలబ్రెటీ కాబట్టి, తన మాటలు నమ్మి మోసపోయామని, లక్షల్లో డబ్బులు ఇచ్చామని, ఇప్పుడు విశ్వంత్ తన చుట్టూ తిప్పుకుంటున్నాడని, డబ్బులు అడిగితే.... మీనమేషాలు లెక్కేస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. విశ్వంత్ ది కాకినాడ దగ్గర్లోని సామర్లకోట. పదో తరగతి వరకు విశాఖలో చదువుకున్నాడు. ఇంటర్ హైదరాబాద్‌లో.. ఇంజనీరింగ్ డిగ్రీని కోయంబత్తూర్‌లో పూర్తి చేశాడు. పోలీసులు విశ్వంత్ ని పిలిపించి, కేసు దర్యాప్తు మొదలెట్టారు.