సినిమా రాను రాను సామాన్యుడికి భారంగా మారుతోందా? అవుననే అనిపిస్తోంది. లాక్ డౌన్ తరవాత.. థియేటర్లు మళ్లీ తెరచుకున్నాయి. చిత్రసీమకు పాత వైభవం మెల్లమెల్లగా వస్తోంది. అయితే.. అదే సమయంలో.. టికెట్ రేట్లు పెంచేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. `ఉప్పెన` విడుదల సమయంలోనూ ఇలానే టికెట్ రేట్లు పెంచేశారు. మల్టీప్లెక్స్ లో 200, సింగిల్ స్క్రీన్ లో 150 గా.. టికెట్ రేటు నిర్ణయించారు.
ఇప్పుడు `చెక్` సినిమాకీ అదే పరిస్థితి పునరావృతం అవుతోంది. ఈ సినిమా టికెట్ రేట్లు కూడా పెంచేయడంతో.. సగటు ప్రేక్షకుడు విస్తు పోతున్నాడు. స్టార్ హీరోల సినిమాల రేట్లు పెంచారంటే ఓ అర్థం ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందించే చిత్రాలవి. వాటి క్రేజ్ ఆ స్థాయిలోనే ఉంటుంది. పెట్టుబడి తిరిగి దక్కించుకోవాలంటే... టికెట్ రేటు పెంచడం తప్ప మరో మార్గం లేదు. అయితే చిన్న సినిమాలు, ఓ మాదిరి బడ్జెట్ సినిమాలకూ ఇలానే బడ్జెట్లు పెంచుకుంటూ పోతే ఎలా? అన్నది ప్రశ్న. థియేటర్లకు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు. వారి ఆసక్తిపై ఈ నిర్ణయం నీళ్లు చల్లినట్టే అవుతుంది.