'ఇంద్ర' సినిమాలో చిన్నప్పటి చిరంజీవి పాత్రలో కన్పించిన బాల నటుడు తేజని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఆ కుర్రాడిప్పుడు యంగ్ హీరోగా మారిపోయాడు. ఇంకా సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వలేదుగానీ, సమంత నటిస్తోన్న 'ఓ బేబీ' సినిమాతో మాత్రం కొత్త అవతారంలో కన్పించబోతున్నాడు. 'సినిమాలో సమంత ముసలి పాత్ర నుంచి యంగ్ పాత్రలోకి వస్తుంది.. నేను మాత్రం బాల నటుడి స్థాయి నుంచి యువకుడిగా ప్రమోషన్ పొందాను' అని సరదాగా వ్యాఖ్యానించాడు తేజ, సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో.
నిజంగానే కుర్రాడు కత్తిలా వున్నాడు. సూపర్ స్టార్ మహేష్‌బాబు తొలుత బాల నటుడిగా పలు సినిమాల్లో నటించి, ఆ తర్వాత గ్యాప్ తీసుకుని, హీరో అయ్యాడు.. తెలుగు తెరపై తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు. తరుణ్ సహా చాలామంది ఈ కోవలోనే బాల నటులుగా నటించి, హీరోలుగా ప్రమోట్ అయ్యారు. అయితే, చాలా అరుదుగా మాత్రమే బాల నటులు, హీరోలయ్యాక స్టార్డమ్ సంపాదించుకున్నారనుకోండి.. అది వేరే విషయం. అయితే, తేజని చూస్తే మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా కన్పిస్తున్నాడు. అందానికి అందం, నటనలోనూ చిన్నప్పుడే సత్తా చాటిన వైనం.. ఇవన్నీ తేజకి మేజర్ ప్లస్ పాయింట్స్. ఆల్రెడీ హీరోగా ఛాన్సులొస్తున్నాయట తేజకి. అన్నట్టు, సమంత మనవడి పాత్రలో నటిస్తున్న తేజ, ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అంటున్నాడు. కొరియన్ ఫిల్మ్‌కి 'ఓ బేబీ' రీమేక్.