ఎందుకొచ్చిన గొడవలే అనుకున్నాడేమో.. మన తెలుగు డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి, ఫైర్ బ్రాండ్ కంగనానే సపోర్ట్ చేసేశాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి. తెలుగులో 'సైజ్‌జీరో' తదితర చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కంగనారనౌత్‌తో 'మెంటల్ హై క్యా' సినిమా తెరకెక్కిస్తున్నాడు. కంగనాతో సినిమా అంటే ఈ మధ్య తెలుగు డైరెక్టర్స్‌కి ఎలాంటి సన్మానం జరుగుతుందో క్రిష్ జాగర్లమూడిని చూస్తే అర్ధమవుతుంది. అందుకే ప్రకాష్ కోవెలమూడి ఎందుకొచ్చిన గొడవలే అనుకున్నాడేమో, చిత్రీకరణ పూర్తయ్యాక సినిమాని కంగనాకి చూపించాడు.
సినిమాని పూర్తిగా వీక్షించిన కంగనా కొన్ని సీన్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎప్పుడూ ఉండేదే.. తన సినిమాల్లో హీరో పాత్ర కన్నా, తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలనే వాదన కంగనాది. అదే విషయమై ఈ సినిమాలోనూ హీరో రాజ్‌కుమార్‌రావు క్యారెక్టర్ హైలైట్ అవుతోందని గ్రహించిన కంగనా, డైరెక్టర్‌కి కొన్ని సూచనలు చేసిందట. ఆయా సీన్స్‌లో తన పాత్ర హైలైట్ అయ్యేలా వాటిని రీషూట్స్ చేయాలన్నదట. ఆ సీన్స్‌ని తానే డైరెక్ట్ చేస్తానన్నదట. ప్రకాష్ కోవెలమూడి కంగనా కోరికను మన్నించి, అందుకు అంగీకారం తెలిపారట.
ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా వివరిస్తూ, కంగనాలో ఓ మంచి దర్శకురాలు ఉంది. సినిమా బాగా రావాలనే ఉద్దేశ్యంతో టాలెంట్ ఉన్న దర్శకురాలు ఇంకో దర్శకుడికి సూచనలూ, సలహాలు (డైరెక్షన్) ఇస్తే తప్పేముంది.? గతంలోనూ కంగనా ఇదే చేసింది. అయితే, ఆమె ప్రవర్తనను కొందరు తప్పు పట్టారు. కానీ, నేను ఆ తప్పు చేయను.. ఫైనల్ అవుట్ పుట్ ఆమె అంగీకారానికే వదిలేస్తాను.. అంటూ ప్రకాష్ సెలవిచ్చారు.